లోకేష్ పై సిబిఐ దాడులా ?  టిడిపిలో ప్రకంపనలు

మంత్రి నారా లోకేష్ పై త్వరలో సిబిఐ దాడులకు రంగం సిద్దమవుతోందా ? అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారమైతే అవుననే సమాధానం వినిపిస్తోంది. పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటి శాఖలకు చినబాబు లోకేష్ మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. పరిశ్రమలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఐటి కంపెనీలకు ఇష్టారాజ్యంగా భూములను ఇచ్చేస్తున్నారు.  పరిశ్రమలు రావాలంటే భూములతో పాటు కొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాటాన్ని ఎవరూ కాదనరు. కానీ భూములను, ప్రోత్సహకాలను తీసుకుంటున్న యాజమాన్యాలు పరిశ్రమలను పెట్టాలి కదా ? ఒప్పందాల్లో చెప్పినట్లుగా ఉద్యోగాలు, చుట్టు పక్కల ప్రాంతాలను అభివృద్ధి చేయాలి కదా ?

 

ఐటి కంపెనీలకు భూములు, ప్రోత్సాహకాల ముసుగులో బినామీలకు, టిడిపి నేతలకే పెద్ద ఎత్తున భూములను దోచిపెట్టేస్తున్నారంటూ లోకేష్ పై విపరీతమైన ఆరోపణలున్నాయి. దానికి తగ్గట్లు లోకేష్ చెబుతున్నట్లుగా పరిశ్రమలు రాలేదు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కనిపించలేదు. ఆ విషయంపైనే బిజెపి నేతలు ఆరోపణలు చేయటమే కాకుండా కేంద్రంలోని వివిధ మంత్రిత్వశాఖలకు ఫిర్యాదులు కూడా చేశారు. ప్రధానంగా బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు లోకేష్ వెంటపడ్డారు.

 

అదే సమయంలో ఓ మాజీ న్యాయమూర్తి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసి చంద్రబాబు, లోకేష్ పై విచారణ చేయించాలంటూ కోర్టులో కేసు వేశారు. అయితే ఆరోపణలకు తగిన ఆధారాలు లేకుండా విచారణకు ఆదేశించలేమని చెప్పిన కోర్టు ఆధారాలు సమర్పించేందుకు గడువు కూడా ఇచ్చింది. అయితే హటాత్తుగా టిడిపికి మద్దతుగా ఉండే మీడియాలో ఓ విషయం బయటపడింది. త్వరలో లోకేష్ పై సిబిఐ దాడులకు రంగం సిద్దమైందని చెప్పింది. నాలుగున్నరేళ్ళలో ఐటి శాఖలకు ఇచ్చిన భూములు, రాయితీలు, అసలు ఆ పరిశ్రమలెవరివి అన్న విషయాలపై సిబిఐ ఆరా తీయనున్నట్లు సమాచారం. మొన్నటి వరకూ ఈడీ, ఐటి శాఖలు మాత్రమే దాడులు చేశాయి. ఇక సిబిఐ కూడా దాడులు మొదలుపెడితే అందులోనూ లోకేష్ తో మొదలైతే టిడిపిలో ప్రకంపనలు ఖాయం.