ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం చేస్తున్న సమీక్షలతో ప్రభుత్వంలోని ముఖ్యులు భయపడుతున్నారా ? మంత్రి యనమల రామకృష్ణుడి వ్యాఖ్యలు చూస్తుంటే అందరిలోను అవే అనుమానాలు పెరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం ఆర్దికశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు ఎల్వీ. ఆ సమీక్షలో అస్తవ్యస్ధంగా తయీరైన ఆర్దిక పరిస్దితిని గమనించారు. అడ్డదిడ్డంగా చేసిన కేటాయింపులను, అత్యధిక వడ్డీలకు తెచ్చిన అప్పులను ప్రశ్నించారు. ఉద్యోగుల జీతాలకు ఇవ్వాల్సిన నిధులను కూడా పక్కనపెట్టి పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ లాంటి ఓట్ల పథకాలకు మళ్ళించటంపై ఎల్వీ సీరియస్ అయ్యారు.
సీఎస్ జరిపిన మొత్తం సమీక్షలో చంద్రబాబునాయుడు, యనమల రామకృష్ణుడు జరిపిన అవకతవకలు బయటపడ్డాయి. దాంతో ఆర్ధికశాఖ కార్యదర్శితో పాటు పలువురు ఉన్నతాధికారులపై ఎల్వీ సీరియస్ అయ్యారు. జరిగిన అవకతవకలకు సంజాయిషీ అడిగారు కార్యదర్శిని. దాంతో విషయం బాగా సీరియస్ అయ్యేట్లుందని అధికారపార్టీ గ్రహించింది. వెంటనే యనమల రంగంలోకి దిగారు.
క్యాబినెట్ నిర్ణయాల ప్రకారమే ఖర్చులు, కేటాయింపులు జరిగినట్లు చెప్పారు. క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించే అధికారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేదంటూ వితండ వాదం మొదలుపెట్టారు. సిఎస్ అంటే మంత్రిమండలికి కేవలం సబార్డినేట్ మాత్రమే అని యనమల వ్యాఖ్యానించటం విచిత్రంగా ఉంది. పైగా సిఎస్ సర్వీసు రూల్స్ కు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
యనమల తీరు చూస్తుంటే ఐదేళ్ళ కాలంలో ప్రధానంగా చివరి నాలుగు నెలల్లో జరిపిన ఆర్ధిక అక్రమాలు బయటపడతాయన్న భయమే యనమలలో కనబడుతోంది. అక్రమాలు బయటపడితే రేపు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే తమకు ఇబ్బందులు తప్పవన్న టెన్షన్ పెరుగుతున్నట్లే ఉంది. అందుకే సిఎస్ పై నోరు పారేసుకుంటున్నారు. ప్రధాన కార్యదర్శిగా ఎల్వీ నియామకమే చంద్రబాబుకు ఇష్టం లేదు. దానిమీద ఆర్ధిక అక్రమాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. దాంతో ఏమి చేయాలో తెలీక నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.