పోటీకి పవన్ భయపడుతున్నారా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఓ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నపుడు రాష్ట్రంలోని ఏ నియోజకవర్గం నుండైనా పోటీ చేయగలిగే సత్తా ఉండివుండాలి. అంతేకానీ సేఫ్ నియోజకవర్గం కోసం వెతుకుతున్నారంటే అర్ధమేంటి ? ఇపుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయంలో జరుగుతున్నది అదే. జనసేన అధ్యక్షుడికన్నా ముందు పవన్ ఓ సెలబ్రిటీ. సెలబ్రటీ హోదాలో అయినా ఎక్కడి నుండైనా పోటీ చేయగలిగే కెపాసిటీ ఉండి ఉండాలి. అలా లేదంటే అనుమానంగానే ఉంది.

రాబోయే ఎన్నికల్లో ఎక్కడి నుండి పోటీ చేయాలో పవన్ ఇంత వరకూ తేల్చుకోలేకపోతున్నారు. ఓ సేఫ్ నియోజకవర్గం కోసం ఏకంగా సెర్చ్ కమిటీనే నియమించారంటేనే తన గెలుపు విషయంలో పవన్ ఎంతటి ఆందోళనలో ఉన్నారో అర్ధమైపోతోంది. సాక్ష్యాత్తు జనసేన అధ్యక్షుడి పోటీకే సేఫ్ నియోజకవర్గం కోసం వెతుకులాట జరుగుతోందంటే ఇక మిగిలిన అభ్యర్ధుల విషయం చెప్పేదేముంది ?

ఇంతకీ పవన్ ఏ నియోజకవర్గాల వైపు చూస్తున్నారు ? ఏ నియోజకవర్గాలంటే విశాఖపట్నంలోని గాజువాక. ముందు భీమిలీ అనుకున్నారు. తర్వాత మారిపోయింది. ఇర పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరు పైన కూడా కన్నేశారట. చిత్తూరు జిల్లాలోని తిరుపతి, తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం వైపు కూడా చూస్తున్నారట. ప్రయారిటీ అయితే గాజువాడ, తిరుపతికి ఇస్తున్నట్లు సమాచారం. చూడబోతే సేఫ్ నియోజకవర్గాన్ని చూసుకోవటంలో పవన్ కల్యాణ్, నారా లోకేష్ కు పెద్దగా తేడా ఉన్నట్లు అనిపించటం లేదు.