చంద్రబాబంటే మోడి  భయపడుతున్నారా ? ఇవేనా కారణాలు

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. నాలుగేళ్ళపాటు ఎన్డీఏతో కలిసి కాపురం చేసిన చంద్రబాబునాయుడు ఏకపక్షంగా తెగతెంపులు తెంచుకున్నారు. ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసిన  దగ్గర నుండి నరేంద్రమోడిపై చంద్రబాబు బాహాటంగానే మండిపడుతున్నారు. వేదిక, సందర్భం ఏదైనా కానీండి మోడినే లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు ఆరోపణలు, విమర్శలతో చెలరేగిపోతున్నారు. బిజెపి, మోడి వ్యతిరేక కూటమి ఏర్పాటుకు చంద్రబాబు కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. అయినా చంద్రబాబు విషయంలో కేంద్రం పల్లెత్తు మాటనటం లేదుం. ఇక్కడే అందరిలోను అనుమానాలు మొదలయ్యాయి.

 

గడచిన నాలుగున్నరేళ్ళ పాలనలో చంద్రబాబుపై వచ్చిన అవినీతి ఆరోపణలకు లెక్కేలేదు.  ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో భారీ అవినీతి జరిగిందని స్వయంగా కంప్ట్రోలల్ అండ్ ఆడిటరల్ జనరల్ (కాగ్) నిర్ధారించారు. అదే సమయంలో మొన్నటి వరకూ మిత్రపక్షాలుగా ఉన్న బిజెపి, పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబుపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు అవినీతిపై బిజెపి నేతలు కేంద్రంలోని మంత్రిత్వ శాఖలకు రాతమూలకంగా ఫిర్యాదులు కూడా చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న కేంద్రప్రభుత్వ పథకాల నిధుల్లోనే అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. ఎన్ని ఆరోపణలు చేస్తున్నా, ఫిర్యాదులు చేస్తున్న కేంద్రం ఎందుకు పట్టించుకోవటం లేదు ?

 

సరే, అవినీతి ఆరోపణలను పక్కనపెట్టినా, మోడీకి వ్యతిరేకంగా చంద్రబాబు జాతీయస్ధాయిలో పార్టీలను ఏకం చేయటానికి దేశమంతా తిరుగుతున్నారు. ఈ నేపధ్యంలోనే జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగింది. తన హత్యకు కుట్ర జరిగిందని ఆరోపిస్తు థర్డ్ పార్టీ విచారణ డిమాండ్ చేస్తు జగన్ హై కోర్టులో కేసు వేశారు. నిజానికి సిబిఐ విచారణకు జగన్ కోర్టులో కేసు వేయాల్సిన అవసరం లేదు. హత్యాయత్నం ఘటన జరిగింది కేంద్రప్రభుత్వ పరిధిలో విమానాశ్రయంలోనే కాబట్టి రాష్ట్రప్రభుత్వ సిఫారసు కానీ కోర్టు ఆదేశాలు కానీ అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.  అయినా కేంద్రం పట్టించుకోవటం లేదు.

 

ఇక తాజాగా ఏపిలోకి సిబిఐ ఎంట్రీని చంద్రబాబు అడ్డుకున్నారు. ఈ విషయంలో కూడా కేంద్రం మౌనంగానే ఉంది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పల్లెత్తు మాట మాట్లాడలేదు. ఒకవైపేమో మోడిని ఎదుర్కొంటామని, అడ్డుకుంటానని చంద్రబాబు బహిరంగంగానే సవాలు విసురుతున్నారు. చంద్రబాబును ముట్టుకుంటే ప్రతిపక్షాలన్నీ ఐక్యమవుతాయని మోడి భయపడుతున్నారా ? జాతయ స్ధాయిలో వ్యతిరేక పార్టీలను ఏకం చేసే సామర్ధ్యం చంద్రబాబుకుందని మోడి ఆమోదించారా ? మళ్ళీ అవసరమైతే రేపటి రోజున చంద్రబాబును దగ్గరకు  తీసుకోవాల్సిన అవసరం వస్తుందని మోడి అనుకుంటున్నారా ? అనే ప్రచారం జరుగుతోంది. లేకపోతే  చంద్రబాబు సవాళ్ళు, కేంద్రం లేదా మోడి మౌనం చూస్తుంటే నిజంగానే చంద్రబాబంటే నరేంద్రమోడి భయపడుతున్నారా అన్న సందేహాలు పెరిగిపోతున్నాయ్.