చంద్రబాబు ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే అనుమానం పెరుగుతోంది. ఒకవైపు వైసిపి ఎంఎల్ఏలేమో చంద్రబాబు ఇంట్లోకి వరద నీరు వచ్చే ప్రమాదముందని మొత్తుకుంటున్నారు. చంద్రబాబు తక్షణమే అక్రమనివాసాన్ని ఖాళీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో అసలు కృష్ణానదిలో వరద నీరు చంద్రబాబు ఇంటి సమీపానికి కూడా రాలేదని టిడిపి నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. చంద్రబాబును ఎలాగైనా కరకట్ట నివాసం నుండి ఖాళీ చేయించటానికే వైసిపి ఎంఎల్ఏలు  అబద్ధాలు చెబుతున్నారంటూ వాదిస్తున్నారు.

సరే ఎవరి వాదన ఎలాగున్నా క్షేత్రస్ధాయిలో వాస్తవ పరిస్ధితులేంటి అన్నది ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలుస్తోంది. నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నివాసానికి వరద ముప్పు ఉన్నది వాస్తవం. నివాసంలోకి వదర నీరు వచ్చేస్తుందన్న భయంతోనే ఇంటిచుట్టూ చంద్రబాబు సిబ్బంది వేలది ఇసుక బస్తాలను రక్షణగా ఏర్పాటు చేశారు. క్రిందున్న ఫర్నీచర్ మొత్తాన్ని మొదటి అంతస్తులోకి మార్చేశారు.

వరదనీరు వచ్చేస్తుందన్న భయం లేకపోతే ఇసుక మూటలను వేయటం ఎందుకు ? ఫర్నీచర్ ను పై అంతస్తులోకి మార్చటం ఎందుకు ? ఇంటిచుట్టూ ఇసుక బస్తాలను పేర్చకపోతే ఈపాటికే నీరు ఇంటి ఆవరణలోకి వచ్చేసేదే.

అలాగే ప్రకాశం బ్యారేజి నుండి ఇపుడు వదులుతున్నది 4.5 లక్షల క్యూసెక్కుల నీరు మాత్రమే. ఈ ప్రవాహానికే చంద్రబాబు సిబ్బంది ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి మొత్తం 8 లక్షల క్యూసెక్కులు వదిలేస్తే అపుడు చంద్రబాబు ఇంటి పరిస్దితేంటి ? ఏమిటంటే కచ్చితంగా ఇంట్లోకి నీళ్ళు వచ్చేస్తుందనటంలో సందేహమే లేదు.  ఒకవేళ అదే జరిగితే అపుడు టిడిపి నేతలు ఏం మాట్లాడుతారో చూద్దాం.