ఏపిలో కూడా మహకూటమి..చంద్రబాబు ప్రయత్నాలు

ఆంధ్రప్రదేశ్ లో కూడా మహాకూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగున్నట్లే ఉంది. అందుకు చంద్రబాబునాయుడే చొరవ తీసుకుంటున్నట్లు కనబడుతోంది. చంద్రబాబు ఒకేసారి మూడంచెల వ్యూహాన్ని అమలు చేసే ప్రయత్నంలో ఉన్నారు. మొదటిదేమో కేంద్రంలో బిజెపియేతర పార్టీలను ఇకతాటిపైకి తేవటం. తెలంగాణాలో కెసియార్ వ్యతిరేక గ్రూపులను కలపటం రెండోది. ఇక మూడోది, ముఖ్యమైనది ఏమిటంటే జగన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్, వామపక్షాలను కలుపుకుపోవటం. పై మూడు ప్రయత్నాల్లోను కామన్ పాయింట్ ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో ఏపిలో తాను లబ్దిపొందటమే.

కేంద్రస్ధాయిల్లో ఇఫ్పటికిప్పుడు నరేంద్రమోడికి వ్యతిరేకంగా అందరూ కలుస్తారనే నమ్మకం లేదు. ఎందుకంటే, ప్రతీ ప్రాంతీయ పార్టీకి ఆయా రాష్ట్రాల్లో శతృవులున్నారు. అదే విధంగా కాంగ్రెస్ కు వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో తీవ్ర విభేదాలున్నాయి. కాబట్టి కాంగ్రెస్ నేతృత్వంలో మోడి వ్యతరేకపార్టీల జట్టు ఏర్పాటవుతుందని ఆశించలేం. కాకపోతే ఎవరో ఒకరు చొరవ తీసుకోవాలి కాబట్టి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అందులోను మోడి వ్యతిరేకులను కలపాల్సిన అవసరం ఇపుడు మిగిలిన వాళ్ళకన్నా చంద్రబాబుకే ఎక్కువుంది.

ఇక, తెలంగాణా పరిస్దితి చూస్తే ఇక్కడ చంద్రబాబు సీట్లు తీసుకునే స్ధితిలోనే ఉన్నారు కానీ కనీసం బేరం కూడా ఆడలేని పరిస్దితి. అందుకనే కాంగ్రెస్ ఇచ్చిన 14 అసెంబ్లీ సీట్లను తీసుకుని సర్దుకుంటున్నారు. పోయిన ఎన్నికల్లో టిడిపి గెలిచిన 15 సీట్లను ఇవ్వటానికి కాంగ్రెస్ అంగీకరించలేదు. అదే విధంగా ఏపిలో కాంగ్రెస్, వామపక్షాలను కలుపుకునే వెళ్ళే ఆలోచనలో చంద్రబాబున్నట్లు తాజా సమాచారం. ఎందుకంటే, జగన్మోహన్ రెడ్డిని తట్టుకుని నిలబడాలంటే చంద్రబాబుకు ఎవరో ఒకరి మద్దతు అవసరం. ఇప్పటికిప్పుడు చంద్రబాబుతో కలిసే పార్టీలేవి లేవు. అందుకే ఆగర్భశతృవైన కాంగ్రెస్ తోను జేబులో పార్టీలైన వామపక్షాలతోను పొత్తుకు రెడీ అవుతున్నట్లు అనిపిస్తోంది.

అందులో భాగంగానే ఈరోజు ఢిల్లీకి వెళ్ళి ఏఐసిసి అధ్యక్షుడు రాహూల్ గాంధితో భేటీ అవుతున్నారు. పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఢిల్లీలో విమానాశ్రయానికి వెళ్ళి  మరీ రిసీవ్ చేసుకున్నారు చంద్రబాబును. తర్వాత వామపక్షాల నేతలతో కూడా కలుస్తారట. మంగళవారం ఢిల్లీ పర్యటనలో సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డిని ఓ సారి కలిసిన విషయం తెలిసిందే. సో, జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే కాంగ్రెస్, వామపక్షాలను కలుపుకుని వెళ్ళాల్సిన అవసరం చంద్రబాబుకే చాలావుంది. అందుకే చొరవ తీసుకుంటున్నారు.