చంద్రబాబునాయుడుపై ఇప్పటి వరకూ అవినీతిపరుడనే ఆరోపణలున్నాయి. సరే రాజకీయాలన్నాక ఆరోపణలన్నీ సహజమే అని సర్దుకోవచ్చు. చంద్రబాబు కూడా తాను నిప్పునని, తనపై ఒక్క ఆరోపణ కూడా లేవని చెప్పుకుంటుంటారు. తనపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఎన్ని కమీషన్లు వేసినా తాను ఏ తప్పు చేయలేదని తేలిందని చెప్పుకోవటం అందరికి తెలిసిందే. కానీ చంద్రబాబు కూడా ఆర్ధిక నేరాలకు పాల్పడ్డారని, హెరిటేజ్ కంపెనీని అడ్డుపెట్టుకుని 20 షెల్ కంపెనీలను తెరిచినట్లు ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు. షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు కుంటుంబం చేసిన ఆర్థిక నేరాలు బయటకు రావాలంటే ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేయించాలంటూ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసి)కు ఫిర్యాదు చేయటం ఆశ్చర్యంగా ఉంది.
షెల్ కంపెనీలు పెట్టారని, కోట్లాది రూపాయల ఆర్దిక నేరాలకు పాల్పడ్డారంటూ చంద్రబాబు, ఆయన కుటుంబంపై మొట్టమొదటిసారిగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మామూలుగా అందరికీ తెలిసింది హెరిటేజ్ కంపెనీ మాత్రమే. అందులో పాలు, పాల ఉత్పత్తులతో పాటు నిత్యావసర సరుకులు అమ్ముతుంటారు. కానీ అందరికీ తెలిసిన హెరిటేజ్ కంపెనీ కాకుండా మరో 20 కంపెనీలున్నాయట. అవన్నీ అక్రమసంపాదనను తరలించేందుకు పెట్టిన షెల్ కంపెనీలే అని న్యాయవాది ఆరోపిస్తున్నారు.
న్యాయవాది ఆర్వోసికి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం చంద్రబాబు కుటుంబం హెరిటేజ్ ఫుడ్స్, హెరిటేజ్ ఆగ్రో మెరైన్ లిమిటెడ్, హెరిటేజ్ న్యూట్రివెట్ లిమిటెడ్, నిర్వాణ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, నిర్వాణ ప్యాకేజింగ్ ప్రైవేట్ లిమిటెడ్, నిర్వాణ ఎనర్జీ ప్రైవేట్ లిమిటాడ్, నిర్వాణ ప్రైవేట్ పవర్ లిమిటెడ్, నిర్వాణ ఎస్టేట్స్ ప్రైవేటు లిమిటెడ్, హెరిటేజ్ కాన్ ప్రో లిమిటెడ్, నిర్వాణ లాజిస్టిక్స్ అండ్ వేర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, రెడ్ హిల్స్ లాజిస్టిక్స్ అండ్ వేర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, మెగాబిడ్ ఫైనాన్స్ అండ్డ ఇన్వెస్టిమెంట్ ప్రైవేట్ లిమిటెడ్, నిర్వాణ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీలున్నాయట.
రామారావు ఫిర్యాదు ప్రకారం పై షెల్ కంపెనీల లెక్కల్లోని బొక్కలు తేలాలంటే ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాల్సిందేనట. చంద్రబాబు కుటుంబం పాల్పడిన మనీ ల్యాండరింగ్ వ్యవహారాలు బయటకు రావాలంటే సీరియస్ ఫ్రాడ్ ఇన్విస్టిగేషన్ ఉన్నతాధికారులు రంగంలోకి దిగాల్సిందేనంటూ న్యాయవాది గట్టిగా కోరారు. నారా లోకేష్ ప్రకటిస్తున్న కుటుంబ ఆస్తులతో పాటు ఆస్తులు, అప్పులు, కంపెనీల వార్షిక ఆర్ధిక లావాదేవీలను కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని కోరారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా గతంలో చాలా కేసులే దాఖలయ్యాయి కోర్టుల్లో. వాటిల్లో కొన్నింటిపై కోర్టులు స్టేలు ఇచ్చాయి. మరికొన్నింటిని కోర్టులు పక్కనపెట్టాయి. మరి తాజాగా తన ముందుకు వచ్చిన ఫిర్యాదుపై ఆర్వోసి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.