అవును చంద్రబాబునాయుడు మాటలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. క్యాబినెట్ సమావేశంలో చంద్రబాబు చెప్పిన మాటలు చూసిన తర్వాత మంత్రులతో పాటు తెలుగుదేశంపర్టీ నేతల్లో కూడా అదే అనుమానం వస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లో బిజెపికే గెలుపు అవకాశాలున్నాయని చెప్పారు. నితిన్ గడ్కరీకే ప్రధానమంత్రి అయ్యే అవకాశాలున్నాయన్నారు. గడ్కరీకే అవకాశం వస్తే టిడిపికి చాలామంచిదన్నారు. తమతో గడ్కరీకి మంచి సంబంధాలున్నాయని చెప్పారు.
గడ్కరీ ప్రధాని అయ్యే అవకాశాలున్నాయని చెప్పేటపుడు చంద్రబాబు మొహం వెలిగిపోయిందట. చంద్రబాబు నోట ఈ మాటలు వినగానే ముందు మంత్రులు ఆశ్చర్యపోయారట. మొన్నటి వరకూ బిజెపి అధికారంలోకి రాదని ఇదే చంద్రబాబు ఎన్నోసార్లు చెప్పారు. అందుకనే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపిఏ ప్రభుత్వానికి మద్దతు కూడగట్టనున్నట్లు తాను దేశంలోని విపక్షాలన్నింటినీ ఐక్యం చేస్తున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే.
చంద్రబాబు ఉద్దేశ్యంలో ప్రధానమంత్రి కావటానికి రాహూల్ కే ఎక్కువ అవకాశం ఉంది. కానీ 6 దశల ఎన్నికలు పూర్తయిపోయిన తర్వాత ఇటు ఎన్డీఏ అటు యూపిఏ కూటముల్లో దేనికీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని దాదాపు తేలిపోతోంది. ఈ పరిస్దితుల్లో చంద్రబాబు హఠాత్తుగా గడ్కరీ ప్రధానమంత్రి అభ్యర్ధి అని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.
చంద్రబాబు మాటలు చూస్తుంటే బిజెపి తరపున ప్రధాని అభ్యర్ధిగా గడ్కరీ ఉంటే మద్దతిచ్చేట్లే కనబడుతోంది. అంటే రాహూల్ ప్రధాన మద్దతుదారుగా ఉన్న చంద్రబాబు ఒక్కసారి యు టర్న్ తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే, చంద్రబాబుకున్న చరిత్ర అలాంటిది కాబట్టే.