చంద్రబాబు ఇల్లు ఖాళీ చేసేస్తారా ?

తాను నివాసముంటున్న అక్రమ నిర్మాణాన్ని చంద్రబాబునాయుడు ఖాళీ చేసేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కరకట్ట మీదున్న అక్రమ నిర్మాణాల్లో ఒకటైన లింగమనేని గెస్ట్ హౌస్ నే క్యాంపు ఆఫీసుగా మార్చుకున్నారు. ఆ గెస్ట్ హౌస్ లో ఉంటూనే పక్కనే ప్రభుత్వంతో మరో అక్రమ నిర్మాణం చేయించి ప్రజావేదిక అని పేరుపెట్టారు.

ఎన్నికల తర్వాత సిఎం అయిన జగన్మోహన్ రెడ్డి ప్రజావేదికను కూలగొట్టించిన విషయం తెలిసిందే. ప్రజావేదికనే కూలగొట్టించిన జగన్ తదుపరి టార్గెట్ లింగమనేని గెస్ట్ హౌసే అని అర్ధమైపోయింది చంద్రబాబుకు. ప్రభుత్వ భవనాన్నే కూలగొట్టించిన జగన్ ప్రైవేటు గెస్ట్ హౌస్ ను మాత్రం ఎందుకు ఉపేక్షిస్తారు ?

విషయం అర్ధమైపోయిన చంద్రబాబు వీలున్నంత తొందరగా తన నివాసాన్ని కూడా ఖాళీ చేసేయాలని నిర్ణయించుకున్నారు. బుధవారం పార్టీ సీనియర్ నేతలతో సమావేశం అయిన చంద్రబాబు తన నిర్ణయాన్ని చెప్పారు. గుంటూరు, విజయవాడకు సమానదూరంలో ఉండేట్లుగా ఓ ఇంటిని అద్దెకు చూడమని చెప్పారట.

ఇదిలా ఉండగా రాజధాని ప్రాంతంలోని ఉద్ధండరాయునిపాలెం టిడిపి నేతలు చంద్రబాబు ముందు ఓ ప్రతిపాదన పెట్టారట. చంద్రబాబు గనుక స్ధలం తీసుకుని ఇంటిని నిర్మించుకోవాలని అనుకుంటే తమ స్ధలం ఇస్తామని చెప్పారట. చంద్రబాబుకు ఎంత అవసరమో అంత స్ధలమూ తీసుకుని అవసరాలకు తగ్గట్లుగా ఇల్లు కట్టుకోవచ్చని చెప్పారట. మరి చంద్రబాబు ఏమి చేస్తారో చూడాల్సిందే.