మహాకూటమికి చంద్రబాబే మైనస్సా ? కొట్టుకుపోయిన కాంగ్రెస్

వెలువడుతున్న ఫలితాలు చూస్తుంటే అందరిలోను అవే అనుమానాలు మొదలయ్యాయి. తెలంగాణాతో పాటు ఎన్నికలు జరిగిన నాలుగు రాష్ట్రాల్లో మూడు చోట్ల కాంగ్రెస్ పార్టీ అధికారం దిశగా పరుగులు పెడుతోంది. మిగిలిన రాష్ట్రం మిజోరంలో కూడా గౌరప్రదమైన స్కోరే సాధించింది. కానీ ఐదో రాష్ట్రమైన తెలంగాణాలో మాత్రమే మరీ దీనస్ధితిలో పడిపోయింది. ఈ స్ధాయికి దిగజారిపోవటాన్ని కాంగ్రెస్ నేతలెవరూ ఊహించుండరనే చెప్పాలి. పెద్ద గాలివాన వస్తే షెడ్ల మీద కప్పిన రేకులు ఎగిరిపోయినట్లుగా  మరీ అన్యాయంగా కాంగ్రెస్ అగ్ర నేతల్లో చాలమంది టిఆర్ఎస్ గాలికి కొట్టుకుపోయారు.

మహాకూటమి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్ధులుగా ప్రచారంలో ఉన్నవారిలో ఒక్క టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రమే గెలుపు దిశగా ప్రయాణిస్తున్నారు. మిగిలిన వారిలో చాలామంది ఓడిపోయారు. మరొకొందరు ఓటమిదిశగా వెళుతున్నారు. ఫలితాలు మరీ వన్ సైడుగా ఉంటాయని బహుశా కెసియార్ కూడా ఊహించుండరేమో ? నిజానికి కెసియార్ ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత ఉందన్నది వాస్తవం. అదే స్ధాయిలో కాంగ్రెస్ పై జనాల్లో సానుకూలమే కనిపించింది. మరి పోలిగ్ విషయానికి వచ్చేసరికి ఏమైందో ఎవరికీ అర్దం కావటం లేదు.

ఎన్ని ఆటుపోట్లు వచ్చినా వరుసగా గెలుస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్  రెడ్డి కూడా జగిత్యాలలో ఓడిపోయారంటేనే ఆశ్చర్యంగా ఉంది. అదే విధంగా నల్గొండలో వరుస విజయాలతో మంచి ఊపుమీదున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఓటమి దిశగా వెళుతుండటమే నమ్మశక్యంగా లేదు. ఇక్కడే గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. రాజస్ధాన్, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఒంటిరిగానే పోటీ చేసింది. ఒక్క మిజోరంలో తప్ప మిగిలిన మూడు రాష్ట్రాల్లో అధికారం అందుకుంటోంది. మరి తెలంగటాణాలో మాత్రం కాంగ్రెస్ కు ఏమైంది ?

ఏమైందంటే మహాకూటమి కట్టటం అందులో తెలుగుదేశంపార్టీ కూడా ఉండటమే కాంగ్రెస్ కు పెద్ద మైనస్ అయ్యిందనే అంచనాలు మొదలయ్యాయి. తెలంగాణా మీద మళ్ళీ చంద్రబాబు పెత్తనం అవసరమా అంటూ కెసియార్ రగిల్చిన సెంటిమెంటు బాగానే వర్కవుటయినట్లు కనిపిస్తోంది. అదే సమయంలో ఏపిలో చంద్రబాబు పాలనలో ఏ స్ధాయిలో అవినీతి జరుగుతోందో తెలంగాణా జనాల్లో అందరికీ తెలుసు.

తెలంగాణాలో గనుక మహాకూటమి గెలిస్తే ఇక్కడ కూడా చంద్రబాబే బ్యాక్ సీట్ డ్రైవింగ్ మొదలుపెడతారనే ప్రచారం బాగా వర్కవుటైనట్లే కనిపిస్తోంది. అదే సమయంలో రాష్ట్ర విభజన అంశం కూడా సీమాంధ్రుల్లో ఇంకా మండుతున్నట్లే ఉంది. అడ్డుగోలుగా మెజారిటి అభిమతానికి విరుద్ధంగా రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్, చేతులు కలిపిన చంద్రబాబును కలిపే జనాలు శిక్షించినట్లు అర్ధమవుతోంది. చంద్రబాబుతో కలవకుండా, మహాకూటమి కట్టకుండా  ఒంటరిగా పోటీ చేసుంటే కాంగ్రెస్ పరిస్ధితి మరీ ఇంత ధీనంగా ఉండేది కాదేమో ?