బాహుబలి సినిమాలో కట్టప్పకు చంద్రబాబునాయుడుకు పోలికలున్నాయా ? ఉన్నాయనే అంటున్నారు బిజెపి ఏపి ఇన్చార్జి సునీల్ దేవధర్. తెలుగుదేశంపార్టీని స్ధాపించిన ఎన్టీయార్ బాహుబలి లాంటి వారైతే చంద్రబాబు కట్టప్ప లాంటి వాడని దేవదర్ ఎద్దేవా చేశారు. అంటే ఎన్టీయార్ ను వెన్నుపోటు పొడిచి పార్టీతో పాటు ముఖ్యమంత్రి పదవిని చంద్రబాబు లాక్కున్న విషయాన్ని జనాలకు దేవధర్ గుర్తు చేశారు.
రాష్ట్రాభివృద్ధికి కేంద్రం వేల కోట్ల రూపాయలు మంజూరు చేయగా ఆ నిధులన్నీ ఏమైపోయాయో అర్ధం కావటం లేదన్నారు. అసలు నిధులే ఇవ్వలేదని చంద్రబాబు అంటుంటే ఇచ్చామని బిజెపి చెబుతోంది. ఎస్సీల సంక్షేమానికి కేంద్రం ఇచ్చిన రూ 1274 కోట్లకు చంద్రబాబు లెక్కలు చెప్పలేదన్నారు. అంటే అందులో భారీగా అవినీతి జరిగిందని చెప్పటమే సునీల్ ఉద్దేశ్యం.
అధికారంలో ఉండగా లెక్కలేనంగా చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు దేవధర్ మండిపడ్డారు. మరి అంతలా అవినీతికి చంద్రబాబు పాల్పడుతుంటే కేంద్రం ఏం చేస్తున్నట్లు ? చంద్రబాబు అవినీతిపై చర్యలు తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డిని డిమొండ్ చేసేబదులు తీసుకునే చర్యలేవో కేంద్రమే తీసుకోవచ్చు కదా ?
మొన్నటి ఎన్నికల్లో ప్రత్యామ్నాయం లేని కారణంగానే జనాలు వైసిపికి ఓట్లేసినట్లు దేవధర్ చెప్పటమే విచిత్రంగా ఉంది. అధికార టిడిపి, ప్రతిపక్షంలోని జనసేన, బిజెపి, కాంగ్రెస్, వామపక్షాలను ఢీ కొనే జగన్ అఖండ విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే జగన్ బంపర్ విజయాన్ని అంగీకరించటానికి బిజెపి కూడా చంద్రబాబు లాగే సిద్దంగా లేదని అర్ధమైపోతోంది. చూద్దాం వచ్చే ఎన్నికల్లో బిజెపి ఏమాత్రం పోటీ ఇస్తుందో ?