కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో తెలుగుదేశంపార్టీ వస్తేనే అభివృద్ధి జరుగుతుందని పోయిన ఎన్నికల్లో నరేంద్రమోడి, చంద్రబాబునాయుడు ఇద్దరూ పోటీ పడి ప్రచారం చేశారు. అప్పటికే వరుస కుంభకోణాలతో ముణిగిపోయున్న కాంగ్రెస్, రాష్ట్ర విభజన నేపధ్యంలో జనాగ్రహానికి తోడు అప్పటి పరిస్ధితుల్లో జనాలు కూడా వారి ప్రచారాన్ని నమ్మారు. అందుకే కేంద్రంలో మోడికి, రాష్ట్రంలో చంద్రబాబుకు పట్టం కట్టారు. కానీ జరుగుతున్నదేంటి ?
మోడి పాలనలో కేంద్రంలో అచ్చేదిన్ వచ్చినట్లేనా ? రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు అనుభవం ఎంత వరకూ ఉపయోగపడింది ? నాలుగున్నరేళ్ళ తర్వాత ఈ ప్రశ్నలను సామాన్యజనాల ముందుంచితే చేతికి ఏది దొరికితే దాంతో కొట్టేట్లున్నారు. పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్ధికవ్యవస్ధనే కుప్ప కూల్చేశారు మోడి. నోట్ల రద్దు దెబ్బ నుండి కోలుకోకుండానే జిఎస్టీ తెచ్చి వర్తక, వాణిజ్య పరిశ్రమలను కోలుకోలేని దెబ్బ కొట్టారు.
తర్వాత నుండి వరుస కుంభకోణాలు, వేలాది కోట్లు రుణాలు తీసుకున్న బడాబాబులు దర్జాగా దేశం విడిచి వెళ్ళిపోవటం చూస్తునే ఉన్నాం. తాజాగా దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్ధ సిబిఐలో కోట్ల రూపాయల లంచాల పేరుతో ఉన్నతాధికారులు కొట్టుకుచస్తున్నారు.
ఇక 40 ఇయర్స్ ఇండస్ట్రీ పాలన చూద్దామా అంటే అవినీతి, అరాచకాలు బాగా పెరిగపోయాయి. తాను తప్ప రాజధానిని నిర్మించే మొనగాడు లేడని చెప్పిన చంద్రబాబు నాలుగున్నరేళ్ళల్లో ఒక్క ఇటుకను కూడా వేయలేకపోయారు. రాజధాని పేరుతో వందల కోట్ల దోపిడీ జరిగిపోతోంది. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో దోపిడి, ప్రభుత్వ పథకాల్లో వేలకోట్ల రూపాయలు దోచుకోవటం, సంక్షేమ పథకాల్లో దోపిడి ఇలా..చెప్పుకుంటూ పోతే దోపిడి తప్ప ఇంకేమీ కనబడదు.
మోడి, చంద్రబాబు ఇద్దరిలోను ఒకే ఒక సారూప్యముంది. అదేమిటంటే, జరిగేది గోరంత చేసుకునే ప్రచారం మాత్రం కొండంత. మొత్తానికి ఇద్దరూ ఇద్దరే సర్వ వ్యవస్ధలను భ్రష్టుపట్టించేస్తున్నారు. భ్రష్టుపట్టిపోయిన వ్యవస్ధలను రిపేరు చేయాలంటే ఎంత కాలం పడుతుందో ?