చంద్రబాబు, మోడి- తెరవెనుక ఏం జరుగుతోంది ?

అవును చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. చంద్రబాబునాయుడు దావోస్ పర్యటన ఎపిసోడ్ చూస్తే తెరవెనుక మోడి, చంద్రబాబు బంధం కొనసాగుతున్నదేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే, చంద్రబాబు దావోస్ పర్యటనపై కేంద్రప్రభుత్వం మొదట ఆంక్షలు విధించింది. కేంద్రం వైఖరిపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగానే తోకముడిచేసి చంద్రబాబు కోరుకున్నట్లుగానే మళ్ళీ లైన్ క్లియర్ చేసేసింది. ఆంక్షలు విధించన ఐదు గంటల వ్యవధిలోనే ఆంక్షలన్నింటినీ ఎత్తేవేసి చంద్రబాబు కోరుకున్నట్లుగానే అనుమతులు మంజూరు చేయటంతో చంద్రబాబు దెబ్బకు నరేంద్రమోడి జడుసుకున్నట్లు తెలుగుదేశంపార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. జరిగినది చూసిన తర్వాత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య ఏదో బయటకు తెలీని బంధం ఉందన్న విషయమై అనుమానాలు పెరిగిపోతున్నాయి.

ఇంతకీ ఏమి జరిగిందంటే, ప్రతీ ఏటా ప్రపంచ ఆర్ధిక సదస్సులో పాల్గొనే పేరుతో చంద్రబాబు దావోస్ కు పర్యటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. నిజానికి దావోస్ నిర్వాహకుల నుండి ఏ సంవత్సరం కూడా చంద్రబాబుకు ఆహ్వానం అందలేదు. తాను ప్రపంచస్ధాయి నేతను అని చెప్పుకోవటానికే చంద్రబాబు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆహ్వానాన్ని కొనుక్కుని దావోస్ కు వెళుతున్నారు. ఆహ్వాన పత్రిక అయితే కొనుక్కుంటున్నాడు కానీ అక్కడకు వెళ్ళటానికి ప్రత్యేక విమానాలు, భారీ బృందంతో వెళ్ళి రావటానికి అయ్యే ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలి కదా ? పోనీ ఏమన్నా లాభముందా అదీ లేదు.

అధికారంలో ఉన్నా లేకపోయినా చంద్రబాబుది ఇదే తంతు. ప్రతిపక్షంలో ఉంటే గుట్టుగా ఓ ఇద్దరితోను ముగ్గురితోను దావోస్ కు వెళ్ళే చంద్రబాబు అధికారంలో ఉంటే మాత్రం ఓ 20 మందికి తక్కువ లేకుండా వెళుతున్నారు. దాంతో ప్రభుత్వంపై అనవసర భారం పడుతోంది. ఇఫుడు కూడా అదే జరగబోతోంది. మొదటి వారం రోజుల దావోస్ పర్యటనకు 17 మందితో అనుమతి కోరుతూ చంద్రబాబు విదేశీ మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చూడగానే దావోస్ పర్యటనపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం నలుగురికి మాత్రమే అనుమతి ఇస్తామని అదికూడా వారం రోజుల పాటు కాకుండా కేవలం నాలుగు రోజులే చాలని కేంద్రం ఆంక్షలు విధించింది. దాంతో కేంద్రం తీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రం తీరును ఆక్షేపిస్తూ చంద్రబాబు మళ్ళీ లేఖ రాయమని ఉన్నతాధికారులను ఆదేశించారు. అంతేకాకుండా కేంద్రంతో కూడా నేరుగా ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. మరి తెరవెనుక ఏమైందో ఏమో చంద్రబాబు మాట్లాడిన వెంటనే చంద్రబాబు కోరుకున్నట్లుగానే కేంద్రం లైన్ క్లియర్ చేసేసింది. నిజనికి దావోస్ కు చంద్రబాబు వెళ్ళిన ఒకటే వెళ్ళకపోయినా ఒకటే. ఎందుకంటే, చంద్రబాబు పర్యటన వల్ల రాష్ట్రానికి జరిగే లాభమేమీ లేదని గత పర్యటనల్లోనే బయటపడింది. అయినా సరే ప్రతీ ఏడాది జాతరలో పాల్గొన్నట్లుగా దావోస్ లో పాల్గొనటం చంద్రబాబుకు ఓ తంతుగా మారిపోయింది. పైగా ఈసారి అపరమేధావి నారా లోకేష్ ను కూడా వెంట తీసుకెళుతున్నారు. మరి, ఈ పర్యటనలో ఏమవుతుందో చూడాలి.