చంద్రబాబుకు ఇద్దరు దీదీలు షాకిచ్చారా ?

అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. నరేంద్రమోడికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశంలోని పార్టీలన్నింటినీ ఏకం చేస్తానంటూ చంద్రబాబు దేశమంతా తిరుగుతున్న విషయం చూస్తున్నదే. అందులో భాగంగా చంద్రబాబు మొన్ననే కోల్ కతా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, అంతుకుముందు మాజీ సిఎం మాయావతిని కూడా కలిశారు. అయితే వారిద్దరూ చంద్రబాబు ఆశలపై నీళ్ళు చల్లేసినట్లు సమాచారం. బిజెపియేతర పార్టీలను ఏకతాటిపైకి తెస్తానని చంద్రబాబు చెబుతున్న మాటలన్నీ కేవలం ఉత్తమాటలేనని అర్ధమైపోతోంది.

చంద్రబాబు ఇప్పటి వరకూ కర్నాటక సిఎం కుమారస్వామి, మహారాష్ట్ర నేత శరద్ పవార్, జమ్ము, కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, తమిళనాడులో డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్ ను కలిశారు. వీళ్ళందరినీ కలిసి తాను బిజెపికి వ్యతిరేకంగా పోరాటం చేయటానికి ఒప్పిస్తున్నట్లు బిల్డప్ ఇచ్చారు. విచిత్రమేమిటంటే, ఇప్పటి వరకూ చంద్రబాబు కలిసిన వాళ్ళంతా ఎప్పటి నుండో బిజెపికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వాళ్ళే. తనకన్నా ముందు నుండే బిజెపితో పోరాటం చేస్తున్న వాళ్ళని మళ్ళీ చంద్రబాబు ఒప్పించటమేంటో ఎవరికీ అర్ధం కావటం లేదు.

ఇక్కడ చంద్రబాబు ఒక విషయం మరచిపోయారు. నాలుగేళ్ళపాటు బిజెపితో అంటకాగిన తర్వాత వ్యక్తిగత లబ్ది విషయంలో మోడితో చెడిన తర్వాతే చంద్రబాబు ఎన్డీఏలో నుండి బయటకు వచ్చారని విషయం అందరికీ తెలుసు. చంద్రబాబు కలసిన నేతలంతా ఆయా రాష్ట్రాల్లో రియల్ ఫైటర్స్ గా పేరున్న వాళ్ళే. ఎవరు కూడా దొడ్డిదోవన అందలాలెక్కిన వాళ్ళు లేరు. చంద్రబాబు ముఖ్యమంత్రి ఎలాగయ్యారో అందరికీ తెలుసు. కాబట్టే వాళ్ళెవరికీ చంద్రబాబంటే పెద్దగా సదభిప్రాయం లేదు. బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడాలి వచ్చి కలుస్తానంటే అందరూ సరే రమ్మన్నారు.

మాయావతి, మమతతో భేటీ అయిన సందర్భంగా చంద్రబాబు ప్రతిపాదనకు బ్రేకులు పడినట్లు సమాచారం. కాంగ్రెస్ నేతృత్వంలో కలిసి పని చేయటానికి వాళ్ళిద్దరూ కుదరదని తెగేసి చెప్పారట. ఎందుకంటే, రేపు బిజెపియేతర కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే ప్రధానమంత్రి పదవి కోసం శరద్ పవార్, మాయావతి, మమతా బెనర్జీ ఎప్పటి నుండో కాచుక్కూర్చున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి వద్దని ప్రాంతీయ పార్టీల కూటమి అయితే తమకు ఓకే అంటూ వాళ్ళిద్దరూ చంద్రబాబు స్పష్టం చేశారట. దాంతో చంద్రబాబుకు ఏమి సమాధానం చెప్పాలో అర్ధం కాలేదట.

Hop in for a free ride with

మొన్న మమతా బెనర్జీని కలిసినపుడు నాలుగు రాష్ట్రాల ఎన్నికలు అయిపోయేంత వరకూ ఆగమని చంద్రబాబుకు సూచించారట. ఎలాగూ వచ్చే మే నెలలోనే పార్లమెంటు ఎన్నికల షెడ్యూలుంది. పార్లమెంటు ఎన్నికల వరకూ ఆగితే చంద్రబాబుకు ఇబ్బందులు తప్పేట్లు లేదు. ఎందుకంటే, పార్లమెంటు ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలినా బెంగాల్, తమిళనాడు, కర్నాటక, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో పై నేతలకు పోయేదేమీ లేదు. మమతాబెనర్జీ, కుమారస్వామి ఎలాగూ సిఎంలుగానే ఉంటారు.  తమిళనాడులో స్టాలిన్ ఇపుడెలాగూ ప్రతిపక్ష నేతే.  మాయావతి కూడా యుపిలో ప్రతిపక్షంలోనే ఉంది. ఏదైనా సమస్యంటూ వస్తే అది చంద్రబాబుకు మాత్రమే.

Hop in for a free ride with

ఎలాగంటే, రేపటి ఎన్నికల్లో ఒకవేళ టిడిపి ఓడిపోతే ఇటు ముఖ్యమంత్రి పదవీ పోతుంది అటు ఎంపి స్ధానాల్లో కూడా దెబ్బ పడుతుంది. ఇపుడు సిఎం హోదాలో కలుస్తున్న చంద్రబాబు రేపు వాళ్ళందిరినీ ప్రతిపక్ష నేత హోదాలో కలవాల్సుంటుంది. అదే సమయంలో వైసిపి అధికారంలోకి వస్తే అందరూ జగన్మోహన్ రెడ్డిని కలుపుకుందామని చూస్తారు కానీ ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుపై ఎందుకుంటుంది దృష్టి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ఎంపి స్ధానాలను పోగొట్టుకున్న తర్వాత ఎవరైనా చంద్రబాబుకు ఎందుకిస్తారు మర్యాద ? అందుకే ఇఫ్పటికిప్పుడే ఏదో ఫ్రంట్ కట్టేద్దామని చంద్రబాబు తాపత్రయ పడుతున్నారు. ఆ విషయాన్ని గ్రహించిన దీదీలిద్దరూ చంద్రబాబు ఆశలపై నీళ్ళు చల్లారని అమరావతి తాజా కబురు. మరి రేపేం జరుగుతుందో చూడాలి.