క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు చూస్తుంటే అదే అనిపిస్తోంది. ప్రకాశం జిల్లాలోని సీనియర్ నేత కరణం బలరామే రాబోయే ఎన్నికల్లో చీరాల అసెంబ్లీలో అభ్యర్ధిగా పోటీ చేయనున్నట్లు సమాచారం. జిల్లాలోని చాలామంది నేతలతో మాట్లాడిన చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చీరాల ఎంఎల్ఏ ఆమంచి కృష్ణమోహన్ టిడిపికి రాజీనామా చేసి వైసిపిలో చేరిన విషయం తెలిసిందే. అప్పటి నుండి ఆమంచిపై చంద్రబాబునాయుడు అండ్ కో మండిపోతున్నారు.
ఆమంచి పార్టీని వీడటంతో కరణం తదితరులను నియోజకవర్గం బాధ్యతలు అప్పగించారు. దాంతో ఈ నియోజకవర్గంలో పోటీకి కరణం దృష్ణిపెట్టారు. పార్టీ ఆదేశిస్తే తాను చీరలలో పోటీకి సిద్ధమంటూ కరణం చేసిన ప్రకటన కూడా ఇందులో భాగమే. నిజానికి కరణం సొంత నియోజకవర్గం అద్దంకి. రాజకీయ ప్రత్యర్ధి, వైసిపి తరపున పోయిన ఎన్నికల్లో గెలిచిన గొట్టిపాటి రవికుమార్ టిడిపిలోకి ఫిరాయించటంతో కరణంకు నియోజకవర్గం లేకుండా పోయింది.
తనకు టికెట్ ఇవ్వరని తెలిసినా కరణం అద్దంకి మీదే దృష్ణి పెట్టారు. దాంతో రెండు వర్గాల మధ్య తీవ్రమైన వివాదాలు జరుగుతున్నాయి. ఈ పరిస్ధితుల్లో ఎంఎల్సీ ఇచ్చినా కరణంకు సృతృప్తి కలగలేదు. నియోజకవర్గంలో ఇద్దరు పోటాపోటీగా రాజకీయాలు నడుపుతునే ఉన్నారు. దాంతో ఎప్పుడూ నియోజకవర్గంలో ఉద్రిక్తలే. ఈ సమయంలోనే ఆమంచి పార్టీ వదిలిపోవటంతో వెంటనే కరణాన్ని చీరాల ఇన్చార్జిగా పెట్టారు చంద్రబాబు.
గొట్టిపాటి, కరణం మధ్య వైరం పోవాలంటే కరణాన్ని చీరాలలో అభ్యర్ధిగా ప్రకటించటమొకటే మార్గమని చంద్రబాబు నిర్ణయించారు. దాంతో చీరాలలో కరణమే అభ్యర్ధిగా నేతలు కూడా ఫిక్సయ్యారు. కాబట్టి రేపో మోపో చంద్రబాబు నేతలతో సమీక్ష పెట్టి ప్రకటించనున్నట్లు సమాచారం.