ఐటి దాడులను సమర్ధించిన పవన్..దోచేస్తుంటే దాడులు జరగవా ?

రాష్ట్రంలో జరుగుతున్న స్కాములు, దోపిడీలకు వ్యతరేకంగా ఐటి దాడులు జరుగటంలో  తప్పేముందని పవన్ తేల్చేశారు. మంచిపాలన అందించమని జనాలు అధికారం అప్పగిస్తే రాష్ట్రాన్ని దోచేస్తున్నారంటూ మండిపడ్డారు. స్కాములు, దోపిడిలతో రాష్ట్రాన్ని దోచేస్తుంటే ఐటి దాడులు జరగవా ? అంటూ చంద్రబాబునాయుడు, లోకేష్ అండ్ కో పై విరుచుకుపడ్డారు. వ్యాపారాలు చేసుకునే రాజకీయ నాయకులపై ఐటి దాడులు జరిగితే తామెందుకు స్పందించాలంటూ సూటిగా  ప్రశ్నించారు. పవన్ వైఖరి చూస్తుంటే టిడిపి నేతలపై జరుగుతున్న ఐటి, ఈడి దాడులను సమర్ధిస్తున్నట్లే ఉంది.

 

ధవళేశ్వరం బ్యారేజి కవాతు తర్వాత రాజమండ్రిలో జరిగిన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. ప్రసంగం మొత్తం చంద్రబాబు, లోకేష్ టార్గెట్ గానే జరగటం గమనార్హం. చంద్రబాబు, నారా లోకేష్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపణల తీవ్రతను పెంచేశారు. తండ్రి, కొడుకులపై  ఓ రేంజిలో మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్ పై ఆరోపణలు, విమర్శలు చేస్తున్న సమయంలోనే వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అంటే తనకేమీ కోపం లేదని చెప్పటం విశేషం. మొన్నటి వరకూ చంద్రబాబును వదిలేసి ప్రతిపక్షంలో ఉన్న జగన్ను కూడా పవన్ టార్గెట్ గా చేసిన విషయం అందరికీ తెలిసిందే.

 

అయితే, ప్రతిపక్షంలో ఉంటూ మరో ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకుంటే ఉపయోగం లేదని పవన్ కు అర్ధమైనట్లుంది. అందుకనే కొద్ది రోజుల నుండి రూటు మార్చారు. అందుకే చంద్రబాబు, లోకేష్ పై తీవ్రత పెంచారు. అర్హత లేకుండానే పంచాయితీరాజ్ శాఖకు మంత్రిని చేస్తే మొత్తం వ్యవస్ధనే నిర్వీర్యం చేసేశారంటూ లోకేష్ పై మండిపడ్డారు.  జన్మభూమి కమిటీలన్నీ గుండాయిజం కమిటీలుగా మారిపోయి దోపిడికి తెరలేచించదన్నారు. పంచాయితీరాజ్ వ్యవస్ధను నిర్వీర్యం చేయటంలో భాగంగానే సర్పంచుల ఎన్నికలను వాయిదా వేశారంటూ ధ్వజమెత్తారు. వెంటనే పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలంటూ డిమాండ్ చేశారు.

 

జనసేన పార్టీ ఎదగకూడదని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. తాను పార్టీ పెట్టి బలొపేతానికి కష్టపడుతున్నానంటూనే చంద్రబాబు సొంతంగా పార్టీ పెట్టలేదని, పార్టీ పెడితే తెలుస్తుందన్నట్లుగా చెప్పారు. అంటే చంద్రబాబు వెన్నుపోటును పరోక్షంగా ప్రస్తావించారు. మళ్ళీ నువ్వే రావాలంటూ వెలసిన చంద్రబాబు ఫ్లెక్సీలను ఉద్దేశించి మాట్లాడుతూ అసలేం చేశావని మళ్ళీ నువ్వే రావాలంటూ నిలదీశారు. ప్రతీ పథకంలోను దోపిడినే కదా జరుగుతోంది ? అంటూ ధ్వజమెత్తటం గమనార్హం. మొత్తం మీద చంద్రబాబు, లోకేష్ టార్గెట్ గా సాగిన పవన్ స్పీచ్ భవిష్యత్  రాజకీయాలను మరింత వేడెక్కించే సూచనలే కనబడుతున్నాయి.