అరెస్టులు తప్పవా ? సిఎం చుట్టు బిగుసుకుంటున్న ఉచ్చు

ఐటి దాడుల నేపధ్యంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కొందరు కీలకమైన నేతల అరెస్టులు తప్పవనే అనిపిస్తోంది. ఈమధ్యనే టిడిపిలో చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితంగా ఉండే పలువురు నేతలపై ఐటి, ఈడి దాడులు జరిగిన విషయం తెలిసిందే. దాడుల్లో భాగంగా సోదాల్లో బయటపడిన అనేక డాక్యుమెంట్లు, పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్కులు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ విషయంపైనే దాడులకు గురైన వారిలో ముఖ్యుడైన సిఎం రమేష్ గగ్గొలు పెట్టేస్తున్నారు.

 

తాజా సమాచారం ప్రచారం దాడులకు గురైన రమేష్, సుజనా, బీద మస్తాన్ రావు, పోతుల రామారావుతో పాటు మరికొందరు వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తల్లో కొందరు అరెస్టులు తప్పకపోవచ్చనే ప్రచారం పార్టీలో బలంగా జరుగుతోంది. అందుకనే నేతలు చాలామంది ఆందోళన పడుతున్నారు. తాజాగా రమేష్ కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్, ప్రాపపర్టీస్ లో కీలకమైన అకౌంటెంట్ సాయిబాబాను విచారించారు. ఆ విచారణలో లెక్కల్లో తేలని రూ 100 కోట్లను గుర్తించినట్లు సమాచారం.

 

తమ్ముడిపేరుతో రమేష్ 10 డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసి కోట్ల రూపాయలను దారి మళ్ళించారని తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. తాజ విచారణలో డొల్ల కంపెనీలకు సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్లు, స్టాంప్ పేపర్లు, సీళ్ళు దొరికాయట. వందకోట్లకు లెక్కలు చెప్పమని అడిగినపుడు సాయిబాబా చేతులెత్తేశారట. దాంతో రూ 100 కోట్లు దారిమళ్ళినట్లు నిర్దారణకు వచ్చారని సమాచారం.

 

మరిన్ని వివరాలు, ఆధారాల సేకరణలో భాగంగా కొందరిని అదుపులోకి తీసుకుంటే కానీ నిజాలు బయటపడవని ఐటి అధికారులు భావించినట్లు తెలుస్తోంది. అదే గనుక నిజమైతే అకౌంటెంట్ లాంటి డొంకను కదిలిస్తే మొత్తం తీగంతా కదిలే అవకాశం ఉంది.