కర్నూలు జిల్లా ఫ్యాక్షన్ కుటుంబాల్లో ఒకటైన గురు కుటుంబం తొందరలోనే వైసిపిలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గౌరు దంపతులు చరితారెడ్డి, వెంకట్రెడ్డి దివంగత నేత వైఎస్ కు అత్యంత సన్నిహితులన్న విషయం అందరకీ తెలుసు. వైఎస్సార్ తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఫాలో అయ్యారు. జగన్ కూడా వారికి చాలా ఇంపార్టెన్సే ఇచ్చారు. కాకపోతే మొన్నటి ఎన్నికల్లో పాణ్యం నియోజకవర్గంలో టికెట్ దక్కదని తెలిసి టిడిపిలో చేరారు.
నిజానికి మొన్నటి ఎన్నికల్లో పాణ్యం నుండి వైసిపి అభ్యర్ధిగా పోటి చేయాల్సింది సిట్టింగ్ ఎంఎల్ఏగా గౌరు చరితారెడ్డే. కాకపోతే కాటసాని రాం భూపాలరెడ్డి ఎంట్రీతో సమీకరణలు మారిపోయాయి. ఎంఎల్ఏ టికెట్ బదులుగా ఎంఎల్సీ టికెట్ ఇస్తానని జగన్ చెప్పినా వినకుండా టిడిపిలోకి వెళ్ళి పోటి చేసి ఓడిపోయారు.
దానికి తగ్గట్లే వాళ్ళు ఓడిపోవటం అదే సమయంలో వైసిపి బంపర్ మెజారిటితో అధికారంలోకి రావటంతో గౌరు కుంటుంబం టిడిపిలో కంటిన్యు అవ్వలేకపోతోంది. మనసంతా వైసిపిలో జగన్ చుట్టూనే తిరుగుతోంది. మనుషులు మాత్రం వేరేదారి లేక టిడిపిలో ఉన్నారు. మానసిక సంఘర్షణను తట్టుకోలేక చివరకు వైసిపిలోకి రీం ఎంట్రీ కోసం జగన్ కు కబురు చేశారట.
జగన్ కూడా వీళ్ళకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఎందుకంటే గౌరు కుటుంబం అంటే జగన్ కు కూడా అపారమైన అభిమానమే. ఏదో క్షణికావేశంలో టిడిపిలోకి మారిపోయారే కానీ వాళ్ళంతా తన మనుషులే అని జగన్ కు తెలుసు. మొన్నటి ఎన్నికల్లో పాణ్యంలో టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసిన చరితారెడ్డి ఓ బహిరంగసభలో మాట్లాడుతూ చివరలో జై జగన్ అని గట్టిగా చెప్పటం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. కాబట్టి తొందరలోనే గౌరు కుటుంబం వైసిపిలోకి రీ ఎంట్రీ తప్పదనే అనిపిస్తోంది.