విశాఖ ఎంపిగా గంటా ? చంద్రబాబుకు కొత్త తలనొప్పి

ప్రతీ ఎన్నికకు ఒక నియోజకవర్గం మారే మంత్రి గంటా శ్రీనివాసరావు రాబోయే ఎన్నికలో విశాఖపట్నం ఎంపిగా పోటీ చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం జిల్లాలోని భీమిలీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మామూలుగా అయితే విజయనగరం జిల్లాలోని నెల్లిమర్లలో పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే జిల్లాలో బలమైన వర్గం కలిగిన కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజుతో ఏమాత్రం పడదు. దానికితోడు జిల్లాలో పరిస్ధితులు కూడా ఏమంత అనుకూలంగా లేకపోవటంతో విశాఖపట్నం ఎంపి స్ధానంపై దృష్టి పడిందని సమాచారం.

ఇక్కడ విషయం ఏమిటంటే ఇప్పటికే విశాఖ ఎంపిగా పోటీ చేయటానికి నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, నారా లోకేష్ తోడల్లుడు శ్రీ భరత్ రంగం సిద్దం చేసుకున్నారు. భరత్ అంటే మాజీ ఎంపి, గీతం విద్యాసంస్ధల వ్యవస్ధాపకుడు ఎంవివిఎస్ మూర్తి మనవడు. కాబట్టి భరత్ కు అంగ బలం, అండ బలానికి కొదవ లేదు. కాబట్టే ఎంపి టికెట్ పై కన్నేశారు.  టికెట్ విషయంలో బాలకృష్ణ నుండి ఈ మేరకు హామీకూడా పొందినట్లు సమాచారం.

ఇటువంటి పరిస్ధితుల్లో హఠాత్తుగా గంటా కూడా విశాఖపట్నం ఎంపిగా పోటీ చేయటానికి ఆసక్తిగా ఉన్నట్లు ప్రచారం ఊపందుకుంది. నిప్పులేందే పొగరాదన్నట్లు  గంటానే తన మద్దతుదారులతో ప్రచారం చేయిస్తున్నట్లు పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. మొన్నటి వరకూ రాబోయే ఎన్నికల్లో భీమిలీ నుండి మళ్ళీ తానే పోటీ చేస్తానని గంటా పదే పదే చెప్పారు.

భీమిలీ టికెట్ కోసం ప్రయత్నాలు చేసుకుని కుదరదని తెలుసుకుని టికెట్ విషయంలో గంటాతో విభేదించే అనకాపల్లి టిడిపి ఎంపి అవంతి శ్రీనివాస్ వైసిపిలో చేరారు. ఎప్పుడైతే అవంతికి భీమిలీ టికెట్ పై హామీ లభించిందో రాబోయే ఎన్నికల్లో  భీమిలీలో గంట-అవంతి మధ్య పోటీ రసవత్తరంగా ఉంటుందని అనుకున్నారు. అలాంటిది హఠాత్తుగా గంటా కొత్త పల్లవి అందుకోవటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మరి చంద్రబాబునాయుడు ఏమంటారో చూడాల్సిందే.