అనేక సంవత్సరాలుగా ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి పెద్దదిక్కుగా ఎర్రన్నాయుడు కుటుంబం కొనసాగుతోంది. ఒక దుర్ఘటనలో ఎర్రన్నాయుడు చనిపోయిన తర్వాత కూడా ఎర్రన్నాయుడు తమ్ముడు అచ్చెన్నాయుడు ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు చురుగ్గా తెలుగుదేశం రాజకీయాల్లో తమ వంతు పాత్ర పోషిస్తూ శ్రీకాకుళం జిల్లాలో పార్టీని నిలబెట్టారు.
జగన్ ప్రభంజనం లో కూడా ఎర్రన్నాయుడు కుటుంబం నుండి శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహన్ నాయుడు మరియు టెక్కలి అసెంబ్లీ నుండి అచ్చెన్నాయుడు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా ఎర్రన్నాయుడు కూతురు ఆదిరెడ్డి భవాని విజయం సాధించారు.
ఆ తరువాత జరిగిన పరిణామాల్లో అచ్చెన్నాయుడు తాను మంత్రిగా పనిచేసిన కార్మిక శాఖలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుకు వెళ్లవలసి వచ్చింది. అయినా కూడా వారేమి పక్కచూపులు చూడకుండా తెలుగుదేశం పార్టీ తోనే ఉంటామని గట్టిగా చెప్పారు. ఈ మధ్యనే అచ్చం నాయుడుకు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టారు కూడా.
ఇంతవరకు అంతా బాగానే ఉంది. అయితే కొన్ని పత్రికల్లో అచ్చెన్నాయుడుకు ఇది కేవలం అలంకార ప్రాయమైన పదవని, అచ్చెన్నాయుడు ఘనంగా ప్రమాణస్వీకారం ఏర్పాటు చేసుకుంటే అందుకు చంద్రబాబు నుండి సానుకూల స్పందన రాలేదని, చంద్రబాబు నాయుడు తాను కూడా హాజరు కాలేనని చెప్పినట్టు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే అచ్చెన్నాయుడుకి తెలియకుండానే రాష్ట్ర కమిటీ వేశారని కూడా ఒక పత్రిక కథనం రాసుకొచ్చింది.
గతంలో కూడా రామ్మోహన్ నాయుడు బీజేపీలో చేరతారని ఒక పుకారు అయితే గట్టిగా వినిపించింది. దానికి బలాన్ని చేకూరుస్తూ రామ్మోహన్ నాయుడు సొంతంగా ఒక సోషల్ మీడియా టీం తయారు చేసుకోవడం కేంద్రంలో బిజెపి నాయకులతో కొంచెం సఖ్యత పెంచుకోవడం, రాష్ట్ర రాజకీయాల పట్ల పెద్దగా స్పందించకుండా ఉండటం గమనిస్తే రామ్మోహన్ నాయుడు తెలుగుదేశంలో సంతోషంగానే ఉన్నారా అని అనిపిస్తుంది.
అలాగే ఇటువంటి పుకార్లు ఆదిరెడ్డి భవాని మీద కూడా వచ్చాయి. ఆది రెడ్డి కుటుంబం రాజమండ్రి లో మంచి పేరు ప్రఖ్యాతలు కలిగి వున్న కుటుంబం. వారు కూడా తెలుగుదేశం పార్టీ అంతర్గత రాజకీయాల వల్ల వైసీపీ వైపు చూస్తున్నారని వార్తలు కూడా వచ్చాయి. అటువంటిదేమీ జరిగినప్పటికీ అచ్చెన్నాయుడు విషయంలో జరుగుతున్న పరిణామాలు, రామ్మోహన్ నాయుడు వ్యవహరిస్తున్న తీరు, ఆది రెడ్డి కుటుంబం మీద వచ్చిన పుకార్లు అన్నీ కలిపి చూస్తే ఎర్రన్నాయుడు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ మధ్య అంతా ఓకే గానే ఉందా అని అనుమానం తప్పకుండా కలుగుతుంది.
సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ అయిన తర్వాత ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితిలో జనాలు వున్నారు. అయితే ఎర్రన్నాయుడు కుటుంబ చరిత్ర చూస్తే గత నలభై సంవత్సరాలుగా టిడిపి జెండాతోనే రాజకీయాల్లో ప్రయాణం సాగించారు. కాబట్టి ఆ కుటుంబం తెలుగుదేశం వదిలి వెళుతుందంటే అది అంత సులభంగా జరిగే పని కాదు. చంద్రబాబు కూడా ఆలా జరగనివ్వరనే తెలుగుదేశం అభిమానులు నమ్ముతున్నారు. చూదాం ఏమి జరుగుతుందో…!