ఈడినే తప్పు  చేసిందట..సుజనా ఎదురుదాడి

తనపై దాదులు జరిపి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి)తప్పు చేసిందన్నట్లుగా సుజనా చౌదరి అలియాస్ సత్యనారాయణ చౌదరి ఎదురుదాడి మొదలుపెట్టారు. తాము దాడులు జరిపిన తర్వాత సరైన విచారణ జరపకుండానే ఆరోపణలు చేయటం తొందరపాటు చర్యే అని ఈడి అంగీకరించినట్లు సుజనా  చెప్పారు. అదేమిటో టిడిపి కీలక నేతలపై ఏ దర్యాప్తు సంస్ధ దాడులు చేసినా తర్వాత తాము దాడులు చేయటం తప్పని ఒప్పుసుకుంటున్నాయి. దాడులు చేయటమేంటో ? దాడుల్లో ఏమీ దొరకలేదని, తప్పు చేశామని అంగీకరించటమేంటో ఎవరికీ అర్ధం కావటం లేదు. రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ పై దాడులు చేసిన ఐటి శాఖ కూడా తమ దాడుల్లో ఏమీ దొరకలేదని ఒప్పుకున్నట్లు తర్వాత రమేష్ చెప్పారు. ఇపుడు సుజనా కూడా అదే చెబుతున్నారు.

 

విచిత్రమేమిటంటే, అసలు సుజనా గ్రూపులతో తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పటం. 2010లో క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే సుజనా గ్రూపుతో తనకున్న అన్నీ సంబంధాలను వదులుకున్నట్లు ఇపుడు చెబుతున్నారు. ఇపుడు చెప్పిన విషయాన్నే మరి అప్పట్లోనే ఎందుకు చెప్పలేదు ? పైగా తమ కంపెనీలు రూ 5700 కోట్ల మోసానికి పాల్పడినట్లు ఈడి ఎలా నిర్ధారిస్తుందని ఎదురుదాడి చూడా  చేస్తున్నారు. 30 ఏళ్ళ కంపెనీ వ్యవహారాలను ఈడి ఒక్క రోజులో ఎలా తేల్చుస్తుందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

 

సరే ఇపుడంటే సుజనా సంస్ధలకు తనకు ఏమీ సంబంధం లేదని చెబుతున్నారు. మరి మారిషస్ బ్యాంకుకు సుమారు రూ 100 కోట్లు ఎగ్గొట్టిన కేసులో నాంపల్లి కోర్టు సుజనాకు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటు జారీ చేసింది కదా ? సుజనా కంపెనీలకు తనకు ఏమీ సంబంధం లేదని అప్పట్లో చెప్పారా ? తనకు డొల్ల కంపెనీలు, షెల్ కంపెనీలంటే కూడా తెలియదని ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారో ?

 

చంద్రబాబునాయుడు అండ్ కో ది మొదటి నుండి ఇదే వరస. తమపై ఎవరు దాడులు చేయకూడదు. తామేం చేసినా ఎవరూ అడక్కూడదు. చంద్రబాబు వాదన కూడా మొదటినుండి ఇదే విధంగా ఉంటోంది. ఓటుకునోటు కేసులో అడ్డంగా దొరికిపోయి కూడా సిగ్గులేకుండా ఇంకా బుకాయిస్తున్నారు. ఓటుకునోటు కేసులో విచారణ మొదలైతే అసలు తనపై విచారణ జరిపే అధికారం ఏసిబికి లేదని వాదించి స్టే తెచ్చుకున్నారే గానీ తాను తప్పు చేయలదని ఇఫ్పటికీ చెప్పటం లేదు.

 

చంద్రబాబు చెబుతున్న మాటలనే తాజాగా సుజనా కూడా అందుకున్నారు. రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్న కారణంగానే తనపై ఈడిని ప్రయోగించారట.  ఈడి జప్తు చేసిన కార్లు తనవి కావట. తన కొడుకు, కూతురు, మేనల్లుడి పేరుమీదుందట. కోట్ల రూపాయలు కొనుగోలు చేయటానికి వాళ్ళకు అంత డబ్బు ఎక్కడిదో మాత్రం సుజనా చెప్పలేదు. వాళ్ళెక్కడ పనిచేస్తున్నారు ? అన్నింటికన్నా విచిత్రమైన వాదన ఏమిటంటే, బ్యాంకులున్నదే అప్పులు ఇవ్వటానికట. పైగా ఏ బ్యాంకు కూడా తనపై ఇంతవరకూ ఫిర్యాదు చేయలేదని బుకాయిస్తున్నారు.

 

మరి అదే నిజమైతే, మారిషస్ బ్యాంకును మోసగించిన కేసులో సుజనా కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నట్లు ? తమ దగ్గర రుణం తీసుకుని సుజనా డబ్బు ఎగ్గొట్టారని మారిషస్ బ్యాంకు ఫిర్యాదు  చేయటం తప్పేనా ? చంద్రబాబు సావాసంతో పాటు బాగా శిక్షణ కూడా తీసుకున్నారు కదా ? అందుకే సాక్ష్యాలతో సహా దొరికినా అడ్డంగానే బుకాయిస్తుంటారు. ఇదే విషయంలో టిడిపి నేతలు కాకుండా ఇంకెవరైనా దొరికుంటేనా ? టిడిపి నేతలతో పాటు టిడిపి మీడియా ఎలా రెచ్చిపోయేవో ?