తొందరలో  వైసిపిలోకి దగ్గుబాటి ?

అవును నిజమే. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఈ విషయం ఇపుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. షెడ్యూల్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపధ్యంలో తటస్తంగా ఉన్న నేతలతో పాటు పలువురు సీనియర్లు తమ రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటున్నారు. అందులో భాగంగా ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నుండి మానుకోట మహీధర్ రెడ్డి, తెలుగుదేశంపార్టీ నేత అన్నే రాంబాబు లాంటి వాళ్ళు వైసిపిలో చేరారు. తొందరలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా వైసిపిలో చేరనున్నట్లు సమాచారం.

రాబోయే ఎన్నికల్లో తన కొడుకు దగ్గుబాటి హితేష్ చెంచురామ్ ను పర్చూరు అసెంబ్లీ నుండి రాజకీయ అరంగేట్రం చేయించాలని దగ్గుబాటి దంపతులు నిర్ణయించారు. అందుకు వైసిపినే సరైన పార్టీ అని వారు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే, చంద్రబాబుతో ఉన్న వైరం వల్ల టిడిపిలోకి వెళ్ళలేరు. దగ్గుబాటి పురంధేశ్వరి బిజెపిలో యాక్టివ్ గానే ఉన్నా ఆ పార్టీకి రాష్ట్రంలో భవిష్యత్తు లేదన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే వైసిపిని తమ ఛాయిస్ గా ఎంచుకున్నారు. ఈ నేపధ్యంలోనే దగ్గుబాటి వెంకటేశ్వరరావు తొందరలో వైసిపిలో చేరనున్నట్లు వైసిపి వర్గాలు చెప్పాయి.

కొడుకు చెంచురామ్ ను పర్చూరు అసెంబ్లీ నుండి పోటీ చేయించాలంటే కొడుకు మాత్రమే వైసిపిలో చేరితే చాలదు. దంపతుల్లో ఎవరో ఒకరు పార్టీలో చేరాల్సిందే. అందుకే ప్రస్తుతానికి కొడుకుతో పాటు చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న వెంకటేశ్వరరావు వైసిపి కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. తర్వాత పురంధేశ్వరి ఏం చేస్తారన్నది ప్రస్తుతానికి పక్కనపెట్టినా ముందు ముందు ఆమె కూడా వైసిపిలో చేరుతారనే అనుకుంటున్నారు. ఒకవేళ చెంచురామ్ గనుక ఏదైనా కారణాల వల్ల ఎన్నికల్లో పోటీ చేయలేకపోతే అప్పుడు వెంకటేశ్వరరావే ఎన్నికల్లోకి దిగేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు కుటుంబానికి సన్నిహితంగా ఉన్నవారు చెబుతున్నారు.  మరి ఏం జరుగుతుందో చూడాలి.