సిఎం గురించి సొంతపార్టీ నేతలే ఉప్పందించారా ?

ప్రతిపక్షాలైన బిజెపి, వైసిపిలు ఇపుడు తెలుగుదేశంపార్టీ రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ పైనే బాణాలు గురిపెట్టాయి. టిడిపిలో అంతమంది ఉండగా ఒక్క రమేష్ నే ఎందుకు టార్గెట్  చేసుకుంటున్నాయి ? ఇపుడిదే ప్రశ్న అందరిలోను మెదులుతోంది.  పార్టీ వర్గాల సమాచారం ప్రకారం సొంత పార్టీ నేతలే రమేష్ గురించి ప్రత్యర్ధులకు ఉప్పందించారనే ప్రచారం జరుగుతోంది. అందుకనే సిఎం రమేష్ పై ప్రతిపక్షాలు గురిపెట్టినట్లు సమాచారం. బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు, వైసిపి నేతలు ప్రధానంగా వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిఎం వెంట పడుతున్నారు.

నిజానికి రమేషేమీ రాజకీయాల్లో ఏళ్ళ తరబడి డక్కామొక్కీలుతిని పైకి వచ్చిన వ్యక్తేమీ కాదు. చాలా వేగంగా చంద్రబాబునాయుడుకు అంత సన్నిహితమైన వ్యక్తి. 1994 ముందు చిత్తూరు జిల్లాలో సిఎం రమేష్ అంటే పెద్దగా ఎవరికీ తెలీదు. ఆ ఎన్నికలకు ముందు జిల్లా టాబ్లాయిడ్లలో తెలుగుదేశంపార్టీకి ప్రత్యేకంగా చంద్రబాబునాయుడుకు మద్దతుగా ప్రకటనలు ఇచ్చుకోవటం ద్వారా అందరి దృష్టిలో పడ్డారు. తర్వాత మెల్లిగా చంద్రబాబుకు బాగా సన్నిహితులతో సంబంధాలు పెంచుకుని టిడిపితో అనుబంధాన్ని పెంచుకున్నారు.

1994 ఎన్నికలు వచ్చేసరికే మద్యం వ్యాపారాలున్న కారణంగా ఆర్ధిక పరిస్ధితి గట్టిగానే ఉండేది. దాంతో చంద్రబాబు ఎప్పుడు జిల్లాకు వచ్చినా బాగా హడావుడి చేసేవారు. తర్వాత టిడిపి అధికారంలోకి రావటం, ఆ తర్వాత ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు సిఎం అవ్వటం అందరికీ తెలిసిందే. దాంతో చంద్రబాబుకు సిఎం రమేష్ బాగా సన్నిహితమైపోయారు. అక్కడి నుండి రమేష్ హవా మొదలైంది. చంద్రబాబును అడ్డం పెట్టుకుని ఒక్కసారిగా పెరిగిపోయారు. దానికితోడు ఏకదాటిగా సుమారు 9 సంవత్సరాలపాటు చంద్రబాబు సిఎంగా ఉండటం రమేష్ కు బాగా కలసివచ్చింది.

తర్వాత పదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా రమేష్ కు ఇబ్బంది కాలేదు. ఎందుకంటే, మొదటి ఐదేళ్ళు వైఎస్ సిఎంగా ఉన్నా ఆయనకు సన్నిహితుడైన కెవిపి రామచంద్రరావుకు కూడా రమేష్ బాగా దగ్గర. అందుకనే కాంట్రాక్టుల విషయంలో సమస్య రాలేదు. ఆ తర్వాత రోశయ్య, కిరణ్  ల హయాంలో కూడా అదే పరిస్ధితి. 2014లో రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు మళ్ళీ సిఎం అవ్వటంతో రమేష్ వ్యాపారాలకు ఆకాశమే హద్దయింది. 2014 నుండి రమేష్ ఎలా చెలరేగిపోతున్నారో అందరికీ తెలిసిందే.

తమ కళ్ళముందే రమేష్ గ్రాఫ్ విపరీతంగా పెరిగిపోవటం టిడిపిలోనే చాలా మంది నేతలకు నచ్చలేదట. దానికితోడు దూకుడు స్వభావంతో రమేష్ చాలామందికి శతృవుగా మారారు. అందుకనే ఇఫుడు రమేష్ పై ఐటి దాడులు జరిగినా, బిజెపి, వైసిపిలకు టార్గెట్ గా మారినా టిడిపి నేతల్లో ప్రత్యేకించి కడప జిల్లా నేతలు పెద్దగా పట్టించుకోవటం లేదు. మరి ఎన్నికలకు ముందు మొదలైన ఐటి దాడులు చివరకు ఎక్కడికి దారితీస్తాయో చూడాల్సిందే.