చంద్రబాబు : పేదరికాన్ని కూడా గెలిచేశారంతే

నాలుగున్నరేళ్ళ కాలంలో చంద్రబాబునాయుడుకు అన్నీ విజయాలే. అధికారంలోకి వచ్చిన కొత్తల్లో ఉత్తరాంధ్రను తుడిచిపెట్టేసిన హుద్ హుద్ తుపానును జయించేశారు. తర్వాత రాష్ట్రంలో విషజ్వరాలకు కారణమైన దోమలపై యుద్ధం చేసి విజయం సాధించేశారు. పంటలు ఎండిపోకుండా పంటకుంటలను తవ్వించి, వర్షాలకు ప్రత్యామ్నాయంగా రైన్ గన్లను వాడుకలోకి తీసుకొచ్చి కరువును గెలిచారు.

ఈమధ్యనే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళంను తీవ్రంగా దెబ్బతీనిప తిత్లీ తుపానును కూడా జయించేశారు. అసలు తుపానులకు కారణమవుతున్న  సముద్రాన్నే ఏకంగా కంట్రోల్లోకి తెచ్చేసుకున్నారు. ఇఫుడు తాజాగా పేదరికాన్ని కూడా జయించేస్తున్నారు. నాలుగున్నరేళ్ళ పాలనలో చంద్రబాబుకు ఇన్ని విజయాలు ఎలా సాధ్యమయ్యాయ్ ? ఎలాగంటే ప్రభుత్వ ప్రకటనల్లో, టిడిపి మీడియాలో మాత్రమే.

అవును, వినేవాడుంటే చెప్పేవాడు చంద్రబాబు అనే నానుడి రాష్ట్రంలో కొత్తగా చక్కర్లు కొడుతోంది. చంద్రబాబు చెప్పుకునేది, ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ప్రకటనల్లో కనబడేది చూస్తుంటే ఈమధ్య చంద్రబాబు గురించి వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి చెప్పింది నిజమే అనిపిస్తోంది. చంద్రబాబు ఓ కంపల్సివ్ లయ్యర్ అనే మానసిక జబ్బుతో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు లేండి. ఈ జబ్బు బారిన పడినవారు భ్రమల్లో బ్రతుకుతూ అబద్ధాలు చెబుతూ జనాలు కూడా తాము చెప్పేదే నమ్మాలని పదే పదే అబద్ధాలు చెబుతుంటారని విజయసాయి చెప్పింది నిజమేనేమో అనిపిస్తోంది.

ఎందుకంటే, హుద్ హుద్ తుపానును గెలిచేశానని చంద్రబాబు చెప్పుకున్నారు. చూస్తే పునరావాస చర్యలు సక్రమంగా అందక ఇప్పటికీ బాధలు పడుతున్న బాధితులు కొన్ని వేలమందుంటారు. తుపాను దెబ్బకు ఇంకా కొన్ని వేలమంది బాధపడుతుంటే హుద్ హుద్ ను జయించేశారని చెప్పుకోవటమేంటి ? ఇక దోమలపై యుద్ధమని ప్రకటించారు. నిజానికి అదో పెద్ద ప్రహసనం. దోమలను జయించేందుకు ప్రధానంగా ఏజెన్సీ ఏరియాల్లో పేదలకు వేలాది దోమతెరలను పంపిణీ చేశామని చెప్పారు. ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. మరి జరుగుతున్నదేమిటి ? ప్రతీ ఏడాది విషజ్వరాలతో వేలాది మంది ఇబ్బంది పడుతూనే ఉన్నారు. దోమలను జయించేసిందెక్కడ ?

పంటలకు ఇబ్బందులు లేకుండా కరువును జయించేశామని చెప్పుకున్నారు. రైన్ గన్ల పేరుతో హడావుడి  చేశారు. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అదంతా టిడిపి కాంట్రాక్లర్ల జేబుల్లోకి వెళ్ళిందనే ఆరోపణలున్నాయి. రాయలసీమ కరువుతో అల్లాడుతోంది. అంతేకాకుండా కేంద్రానికి పంపిన కరువు నివేదికలో రాష్ట్రంలో 400 మండలాలు కరువుతో ఇబ్బంది పడుతున్నట్లు స్వయంగా ప్రభుత్వమే నివేదిక పంపటం గమనార్హం. కరువును జయించటం నిజమా లేకపోతే 400 మండలాలు కరువుతో ఇబ్బందులు పడుతున్నది నిజమా ? చంద్రబాబే చెప్పాలి.

తాజాగా శ్రీకాకుళం జిల్లాను దెబ్బతీసిన తిత్లీ తుపానును కూడా జయించేశామని చంద్రబాబు చెప్పారు. కొన్ని వేలమంది బాధితులు తమకు సహాయ చర్యలు అందలేదని ఇప్పటికీ ప్రభుత్వాన్ని శాపనార్ధాలు పెడుతున్నారు. విత్రమేమిటంటే శ్రీకాకుంళం తిత్లీ తుపాను బాధితులందరినీ ఆదుకున్నట్లు అమరావతిలో పెద్ద పెద్ద హోర్డింగులతో ప్రచారం చేసుకోవటం. బాధితులతో మాట్లాడేందుకు వచ్చిన ఎంపి రామ్మోహన్ నాయుడును జనాలు తరిమికొట్టిన విషయం అందరూ చూసిందే. అసలు సముద్రాన్నే తాను కంట్రోల్లో పెట్టుకున్నట్లు చంద్రబాబు చేసిన ప్రకటనతో అందరూ ఆశ్చర్యపోయారు.

ఇక పేదరికంపై గెలుపు సాధించేస్తున్నట్లు చంద్రబాబు హోర్డింగులు పెట్టి ప్రకటనలు జారీ చేసుకున్నారు. ముందు చెప్పుకున్నవన్నీ ఒక ఎత్తైతే పేదరికంపై గెలుపు మరో ఎత్తు. ఎందుకంటే ? ఇది ఎన్నికల జమ్మిక్కు. నాలుగు నెలల పాటు 8 లక్షల మంది లబ్దిదారులకు వివిధ యూనిట్లు పంపిణీ చేస్తారట. అందుకని రూ 4 వేల కోట్లు ఖర్చు పెడుతున్నారట. పైగా  ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ, ఎంబిసి, కాపులు, బ్రాహ్మణ, ఈబిసి వర్గాల్లో దేన్నీ వదల్లేదు. నాలుగు నెలల పాటు యూనిట్ల పంపిణీ అంటే అప్పటికి ఎన్నికలు వచ్చేస్తాయి. రూ 4 వేల కోట్లతో 8 లక్షల యూనిట్లు పంపిణీ చేయటమంటే అచ్చంగా ‘ఓటుకునోటు’  కాక మరేమిటి ? అసలు పేదరికాన్ని గెలవటం ప్రభుత్వాలకు సాధ్యమేనా ? రాష్ట్ర జనాభాలో 70 శాతంకు పైగా పేదలే అయినపుడు ఇక పేదరికాన్ని జయించిందెక్కడ ? ఏమిటో చంద్రబాబు మరీ ఇలా అయిపోతున్నారు !