ఆ వైసిపి ఎమ్మెల్యేనే చంద్రబాబు మెయిన్ టార్గెట్

వచ్చే ఎన్నికల్లో  వైసిపిలోని కొందరు నేతలపై చంద్రబాబునాయుడు గట్టిగానే గురిపెట్టారు.  రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల సంగతి ఎలాగున్నా రాజధాని గుంటూరు జిల్లాలోని వైసిపి ఎంఎల్ఏల్లో మంగళగిరి ఎంఎల్ఏ  మాత్రం చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్నారు. ఆళ్ళ మొదటి నుండి చంద్రబాబును నీడలా వెంటాడుతున్నారు. ఎంత అవకాశం ఉంటే అన్ని రకాలుగానూ చంద్రబాబును వెంటాడుతున్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో ఆళ్ళను ఓడించటమే టార్గెట్ గా పెట్టుకున్నారట.  

నిజానికి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీ పోటీ చేసిందే లేదు. ఎప్పుడో 1985 ఎన్నికల్లో నేరుగా పోటీ చేసింది. తర్వాత జరిగిన ప్రతీ ఎన్నికలోనూ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవటం వాళ్ళకు సీటును వదులుకోవటమే. దాంతో మంగళగిరి నియోజకవర్గంలో టిడిపి అస్ధిత్వమే కోల్పోయింది. అటువంటిది పోయిన ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధి ఆళ్ళ రామకృష్ణారెడ్డి పోటీ చేయగా టిడిపి తరపున గంజి చిరంజీవి పోటీ చేశారు. గెలిచిన ఆళ్ళకు 88977 ఓట్లు వస్తే ఓడిన చిరంజీవికి 88965 ఓట్లు పోలయ్యాయి. అంటే ఆళ్ళ గెలిచింది కేవలం 12 ఓట్ల మెజారిటీతో మాత్రమే.

ఆళ్ళ గెలిచిన దగ్గర నుండి సీన్ మారిపోయింది. ఎప్పుడైతే రాజధానిగా చంద్రబాబు గుంటూరు జిల్లాను ఎంచుకున్నారో అప్పటి నుండే ఆళ్ళ చాలా యాక్టివ్ అయిపోయారు. ఎలాగంటే రాజధాని ప్రాంతముండేది మంగళగిరి నియోజకవర్గంలోనే. అప్పటి నుండి ప్రతిపక్ష సభ్యుడంటే ఎలా ఉండాలో చంద్రబాబుకు ఆళ్ళ రుచి చూపిస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని రైతుల పంటపొలాలను  సమీకరించి రాజధాని కట్టాలని అనుకున్నారో అప్పటి నుండే ఆళ్ళ పోరాటం మొదలైంది.   

రాజధాని నిర్మాణంలో భూములు ఇవ్వటానికి ఇష్టపడని రైతులను ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుంటే వారి తరపున న్యాయస్ధానంలో పోరాటం మొదలుపెట్టారు. రాజధాని రైతుల తరపునే హైకోర్టులో సుమారు 20 కేసులేసుంటారు. అన్నింటిలోను ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులు స్టే ఇచ్చింది. అదే సందర్భంలో ఓటుకునోటు కేసులో కూడా చంద్రబాబు పాత్రపై హైకోర్టుతో పాటు సుప్రింకోర్టులో కూడా కేసులేశారు. అలాగే, కారు చవకగా తమ వారికి సదావర్తి సత్రం భూములు కట్టబెట్టాలని అనుకుంటే ఆ విషయంలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున న్యాయపోరాటం చేశారు. ఆళ్ళ పోరాటం వల్లే భూములు అన్యాక్రాంతం కాకుండా ఆగిపోయాయి. చంద్రబాబు మీద న్యాయస్ధానాల్లో ఈ స్ధాయిలో పోరాటం చేసిన ఎంఎల్ఏ మరొకరు లేరనే చెప్పాలి.  ఇటువంటి అనేక కారణాలతో ఈ వైసిపి ఎంఎల్ఏ చంద్రబాబు కంటిలో నలుసులాగ తయారయ్యారు. 

తన పోరాటాల వల్ల రాజధాని రైతులే కాకుండా ఇతర వర్గాల్లో కూడా ఆళ్ళ చొచ్చుకుపోతున్నారు. నియోజకవర్గంలోని వర్తక, వ్యాపార వర్గాల్లోనే కాకుండా వివిధ సామాజికవర్గాల్లో కూడా బాగా పట్టుసాధించారు. ఈ మధ్య మంగళగిరి మున్సిపాలిటిలోని ఓ వార్డుకు జరిగిన ఎన్నికలో వైసిపి తరపున ఆళ్ళ ఒక్కరే ప్రచారం చేశారు. టిడిపి తరపున మంత్రులు, ఎంపి, ఎంఎల్ఏలు ప్రచారం చేసినా చివరకు వైసిపి అభ్యర్ధి భారీ మెజారిటీతో గెలవటమే ఆళ్ళ పట్టుకు నిదర్శనం. అదే సందర్భంలో సొంత డబ్బులతో రాజన్న క్యాంటిన్ ప్రారంభించి పేదల ఆకలి తీరుస్తున్నారు.

రాజధాని అమరావతి కూడా మంగళగిరి నియోజకవర్గంలో అతర్భాగం కావటం, ఆ నియోజకవర్గానికి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎంఎల్ఏ కావటాన్ని చంద్రబాబు ఏమాత్రం సహించలేకున్నారు. తనను ఇంతగా ఇబ్బంది పెడుతున్న ఆళ్ళను వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్ధితుల్లోను గెలవనీయకూడదని చంద్రబాబు గట్టిగా నిర్ణయించుకున్నారు. కాకపోతే ఆళ్ళపై పోటీ చేయటానికి గట్టి అభ్యర్ధులే దొరకటం లేదని  సమాచారం. ఇక నియోజకవర్గం విషయానికి వస్తే 30 వేల ఓట్లున్న చేనేతలదే మెజారిటి. తర్వాత కాపులు 24 వేలు, కమ్మోరు 16 వేలు, రెడ్లు 18 వేలు, ఎస్సీ, ఎస్టీలు 50 వేలు, ముస్లింలు 20 వేలు, యాదవుల ఓట్లు 20 వేలున్నాయట.  చంద్రబాబు అండ్ కో ను ఎదుర్కొని వచ్చే ఎన్నికల్లో ఆళ్ళే గెలుస్తారో ? లేకపోతే చంద్రబాబుదే పై చేయవుతుందో చూడాల్సిందే.