మొన్న జరిగిన మధ్యప్రదేశ్, రాజస్ధాన్, ఛత్తీస్ ఘఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం వెనుక తన కృషి చాలావుందని చంద్రబాబునాయుడు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. తన వల్లే బిజెపి చిత్తుచిత్తుగా ఓడిపోయిందని విశాఖపట్నం జిల్లా పర్యటనలో చెప్పారు. మొన్న ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. రాజస్ధాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘఢ్, మిజోరం, తెలంగాణా రాష్ట్రాల్లో ఎన్నిక జరిగాయి. వీటిల్లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచింది. తెలంగాణాలో టిఆర్ఎస్ ఘనవిజయం సాధించింది. మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్ గెలిచింది. అంటే మొత్తం మీద ఏ రాష్ట్రంలో కూడా బిజెపి గెలవలేదన్నది వాస్తవం.
అయితే తెలంగాణాలో కాంగ్రెస్ తో జత కట్టిన తెలుగుదేశంపార్టీ, సిపిఐ, టిజెఎస్ లు మహాకూటమిగా ఎన్నికలను ఎదుర్కొన్నాయి. సరే ఎన్ని కూటములు కట్టినా కెసియార్ ముందు బొక్క బోర్లా పడ్డాయి. తాజాగా చంద్రబాబు మాట్లాడుతూ, మధ్యప్రదేశ్, రాజస్ధాన్, ఛత్తీస్ ఘఢ్ లో బిజెపి సాధించిన ఘన విజయం విజయానికి తానే కారణమని చెప్పటం అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. పై మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయానికి చంద్రబాబుకు ఏమిటి సంబంధమో ఎవరికీ అర్ధం కావటం లేదు.
పై రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపు 15 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉంది. ఈ ఎన్నికలు హస్తం పార్టీకి చావో రేవో లాగ తయారయ్యాయి. అందుకే విభేదాలన్నింటినీ పక్కనపెట్టారు కాంగ్రెస్ నేతలు. అదే సమయంలో బిజెపి పాలనపై పెరిగిపోయిన వ్యతిరేకత కూడా కాంగ్రెస్ కు కలసివచ్చింది. దాంతో కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో విజయం సాధించింది. వాస్తవం ఇలావుండగా కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో గెలుపుకు తానే కారణమని చంద్రబాబు చెప్పుకుంటున్నారంటే వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి చెప్పిందే నిజమేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఆమధ్య విజయసాయి మాట్లాడుతూ చంద్రబాబులో కంపల్సివ్ లయ్యింగ్ డిజార్డర్ (అబద్దాలు చెబుతు భ్రమల్లో బతకటం) అనే రుగ్మత పెరిగిపోయిందని చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది.
ఎక్కడో ఉన్న మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపుకు చంద్రబాబే కారణమైతే మరి తాను స్వయంగా ప్రచారం బాధ్యతలు మోసిన తెలంగాణాలో కాంగ్రెస్ లేకపోతే మహాకూటమి ఎందుకు ఓడిపోయింది ? సంబంధం లేకపోయినా మూడు రాష్ట్రాల్లో గెలుపు తన వల్లే అని చెప్పుకుంటున్న చంద్రబాబు తెలంగాణాలో మహాకూటమి ఓటమికి బాధ్యత వహిస్తారా ? కాంగ్రెస్ గెలిచిన మూడు రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో చంద్రబాబు ఒక్కసారి కూడా పర్యటించలేదు. కాంగ్రెస్ కు ఓట్లు వేయమని ఒక్కసారి కూడా పిలుపివ్వలేదు. అంటే దేశంలో బిజెపి ఎక్కడ ఓడిపోయినా అందుకు తానే కారణమనే భ్రమలో చంద్రబాబు ముణిగిపోయినట్లున్నారు. అంతకుముందు కర్నాటక విషయంలో కూడా ఇలాగే చెప్పుకున్నారు. చంద్రబాబు ధోరణి చూస్తుంటే ఆయనలో మార్పు వచ్చే అవకాశాలు లేవని స్పష్టంగా అర్ధమైపోయింది.