2019లో నిమ్మకాయలకు షాక్ తప్పదా ?

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు కొందరికి గట్టి షాకే ఇవ్వనున్నట్లు సమాచారం. కొందరికి అనూహ్యంగా నియోజకవర్గాలను మార్చేయటం, మరి కొందరికి టిక్కెట్లు ఇచ్చే విషయంలో చంద్రబాబులో రెండో ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్పకు గట్టి షాక్ తగలటం ఖాయమని పార్టీలో ప్రచారం జరుగుతోంది. పోయిన ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం నియోజకవర్గం నుండి గెలిచిన నిమ్మకాయలకు  వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు అసలు టిక్కెట్టిస్తారా ? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇంతకీ విషయం ఏమిటంటే, పోయిన ఎన్నకల్లో నిమ్మకాయల పెద్దాపురంలో 10 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. నిజానికి పెద్దాపురం రాజప్ప నియోజకవర్గం కాదు. రెండు దశాబ్దాలుగా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షునిగానే ఉన్నారు. పోయిన ఎన్నికల్లో టిడిపి సీనియర్ నేత బొడ్డు భాస్కరరావు వైసిపిలోకి మారిపోవటంతో ఆ నియోజకవర్గంలోకి నిమ్మకాయల వలస వెళ్ళారు. ఏదో అదృష్టం కొద్దీ గెలిచారు. అయితే, వైసిపిలోకి వెళ్ళిన బొడ్డు మళ్ళీ టిడిపిలోకి వచ్చేశారు. 2019లో టిక్కెట్టు విషయంలో హామీతోనే బొడ్డు టిడిపిలోకి వచ్చారు. అందుకనే రాబోయే ఎన్నికల్లో తనకే టిక్కెట్టంటూ బొడ్డు నియోజకవర్గంలో తెగ హడావుడి చేసేస్తున్నారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన బొడ్డు ఆర్ధికంగా బాగా బలవంతుడు. దాంతో నిమ్మకాయల కూడా బొడ్డును ఆపలేక అయోమయంలో పడ్డారు.

 

పోనీ వేరే ఏదైనా నియజకవర్గంలో పోటీ చేద్దామా అంటే ఒక్కదానిలోను అవకాశం లేదు. ఎక్కడిక్కడ సిట్టింగులు లేకపోతే గట్టి నేతలున్నారు. దాంతో పెద్దాపురంలో బొడ్డుకే టిక్కట్టు ఖాయమైతే నిమ్మకాయల పోటీ చేయటానికి నియోకవర్గమే లేదు. అందుకే చంద్రబాబు కూడా నిమ్మకాయలను వచ్చే ఎన్నికల్లో పక్కనపెట్టేసి జిల్లా మొత్తాన్ని సమన్వయం చేసే బాధ్యతను అప్పగించాలని అనుకుంటున్నారట. ఒకవేళ అధికారంలోకి వస్తే మళ్ళీ నిమ్మాకయలను ఎంఎల్సీగా పంపితే సరిపోతుందని అనుకుంటన్నారని సమాచారం. ఎందుకంటే, ఎంఎల్ఏ కాకముందు నిమ్మకాయల శాసనమండలి సభ్యుడే కదా ?