అవినీతి నియంత్రణలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కేంద్రప్రభుత్వం తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు అర్దమైపోతోంది. చంద్రబాబునాయుడు హయాంలో భారీగా అవినీతి జరిగిందని ఒకపుడు స్వయంగా నరేంద్రమోడినే ఆరోపించారు. మిగిలిన శాఖల్లో దోపిడి ఎలాగున్నా పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఓ ఏటిఎంలాగ ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు.
అలాంటి ప్రాజెక్టులో జరిగిన అవినీతిని బయపెట్టేందుకు, నియంత్రించేందుకు జగన్ ప్రయత్నిస్తుంటే కేంద్రమే అసంతృప్తిని వ్యక్తం చేయటం విచిత్రంగా ఉంది. తాజాగా పార్లమెంటులో కేంద్ర జలశక్త శాఖ మంత్రి షెకావత్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ నవయుగ కంపెనీని తప్పించటం ప్రభుత్వం తప్పన్నట్లుగా మాట్లాడారు. కాంట్రాక్టర్ ను పనులనుండి తప్పించిన కారణంగా పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమంటూ ప్రకటించటమే ఆశ్చర్యంగా ఉంది.
తాజా అంచనాల ప్రకారం ప్రాజెక్టు పూర్తవ్వాలంటే రూ. 55,548 కోట్లు ఖర్చవుతుంది. ఇప్పటి వరకూ జరిగిన పనుల్లో భారీ అవినీతి జరిగిందన్నది వాస్తవం. అవినీతిని బయటకు తీయటం, రివర్స్ టెండరింగ్ పద్దతిలో ప్రాజెక్టు వ్యయాన్ని తగ్గించటం జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. జగన్ అనుకున్నట్ల రివర్స్ టెండరింగ్ లో తక్కువ వ్యయంతోనే ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఎవరైనా ముందుకొస్తే అది కేంద్రానికే మంచిది.
ఆ విషయాలు తెలిసి కూడా కేంద్రమంత్రి జగన్ చర్యలను తప్పుపడుతున్నారంటే అర్ధమేంటి ? జరిగిన అవినీతిని బయటపెట్టటం కేంద్రానికి ఇష్టం లేనట్లే ఉంది. అదే సమయంలో చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడుతున్నారనే అనుకోవాలి. సో మొత్తం వ్యవహారం చూస్తుంటే చంద్రబాబును బిజెపి దగ్గరకు తీసుకుంటున్నట్లే అనుమానం వస్తోంది.