చంద్రబాబు వల్లే బిజెపి 3 రాష్ట్రాల్లో ఓడిపోయిందా ?

అలాగే ఉంది చంద్రబాబునాయుడు మాటలు చూస్తుంటే. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే మూడు రాష్ట్రాల్లో బిజెపి చిత్తుగా ఓడిపోయిందని చంద్రబాబు అండ్ కో చంకలు గుద్దుకుంటున్నారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో బిజెపిపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందట. బిజెపియేతర పార్టీలను ఏకతాటిపైకి తేవటంలో తాను చేస్తున్న కృషి ఫలిస్తున్నట్లు చంద్రబాబు జనాల చెవుల్లో పూలు పెడుతున్నారు. ఈరోజు ఉదయం పార్టీ నేతలతో జరిగిన టెలికాన్ఫరెన్సులో తెలంగాణాలో తనను ఛీ కొట్టి తరిమేసిన విషయాన్ని మాత్రం ఎక్కడా చంద్రబాబు పొరపాటున కూడా ప్రస్తావనకు రానీయలేదు. జరిగిన విషయం తెలిసిన తర్వాత తమ్ముళ్ళు మాత్రం ప్రస్తావన తేవటానికి ఎలా ధైర్యం చేస్తారు. అందుకనే చంద్రబాబు సహజరీతిలో యధేచ్చగా అందరి చెవుల్లో పూలు పెట్టేశారు.

 

దేశంలో బిజెపి పరిపాలన పోవాలన్నదే జనాల అభిప్రాయంగా చంద్రబాబు తేల్చేశారు. ఏపికి బిజెపి అన్యాయం చేసిందని దేశవ్యాప్తంగా తిరస్కరిస్తున్నారట. బోడిగుండుకు మోకాలికి ముడేయటమంటే ఇదే మరి. ఏపికి బిజెపి అన్యాయం చేసిందన్నది వాస్తవం. మరి ఏపికి జరిగిన అన్యాయంలో మోడికెంత పాత్రుందో చంద్రబాబు పాత్ర కూడా అంతే ఉంది. ఎందుకంటే, బిజెపితో నాలుగేళ్ళ పాటు అంటకాగింది చంద్రబాబే మరి.

 

బిజెపియేతర పార్టీలను కలపటంలో టిడిపి చేస్తున్న ప్రయత్నాలకు దేశవ్యాప్తంగా ప్రజా ఆమోదం లభిస్తోందట. అసలు ఈ మాటలకు ఏమన్నా అర్ధముందా ? బిజెపియేతర పార్టీలను చంద్రబాబు ఇపుడు ఏకం చేయటమేంటి ? బిజెపిని వ్యతిరేకిస్తున్న పార్టీల్లో చాలా వరకూ ఎప్పటి నుండో యూపిఏలోనే ఉన్నాయి కదా ? వాటితో కొత్తగా చేరింది చంద్రబాబే. అసలు బిజెపియేతర పార్టీల్లో ప్రధాన పార్టీల అధినేతలు మమతా బెనర్జీ, మాయావతి, నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళు చంద్రబాబుకు ఇంత వరకూ ఎటువంటి హామీనీ ఇవ్వలేదు. పైగా చంద్రబాబును పూచికపుల్లలాగ తీసిపారేస్తున్నారట దీదీలిద్దరు.

 

రేపటి ఎన్నికల్లో ఓడిపోతే తన కష్టకాలం తప్పదన్న భయంతో చంద్రబాబే అందరితోను కలుస్తున్నారు. ఏదో ఓ జాతీయ పార్టీ అండ లేకపోతే కష్టమన్న ఆందోళనతోనే చంద్రబాబు కాంగ్రెస్ తో చేతులు కలిపిన విషయం ప్రతీ ఒక్కళ్ళకు తెలుసు. అయితే, చంద్రబాబే రివర్సులో కలరింగ్ ఇస్తున్నారు. ఏపికి బిజెపి నమ్మకద్రోహం చేసిందని చెబుతున్న చంద్రబాబు తాను కూడా అదే చేశారు. ప్రత్యేకహోదాపై ఎన్నిసార్లు పిల్లిమొగ్గలు వేశారో ఎవరికి తెలీదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల ఎన్నికలు వేరు తెలంగాణా ఎన్నికలు మాత్రం వేరట. తెలంగాణాలో కెసియార్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళటమే కలిసి వచ్చిందట. అంతేకానీ తన తెలంగాణా ఓటర్లు ఛీ కొట్టి తరిమేశారని మాత్రం అంగీకరించటం లేదు.