బాలకృష్ణకు తెలంగాణా టిడిపి పగ్గాలా ?

తెలంగాణాలో తెలుగుదేశంపార్టీకి జవసత్వాలు అందించేందుకు నందమూరి బాలకృష్ణ ఏమన్నా బాధ్యతలు తీసుకుంటున్నారా ? అందరిలోను ఇపుడు అదే అనుమానం మొదలయ్యింది. ఎందుకంటే, మంగళవారం ఖమ్మం జిల్ల సత్తుపల్లి నియోజకవర్గం సమీక్ష నిర్వహించారు. ఖమ్మం  జిల్లాలో పర్యటించిన బాలకృష్ణ  సత్తుపల్లి టిడిపి ఎంఎల్ఏ సండ్ర వెంకట వీరయ్య క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సుమారు మూడు గంటలపాటు నేతలు, కార్యకర్తలతో ఓపిగ్గా మాట్లాడారు. పార్టీ విధివిధానాలేంటి ? పార్టీ బలోపేతానికి ఏం చేయాలి ? ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై టిడిపి పరంగా చేస్తున్న ఆందోళనలేంటి ? అనే అంశాలపై బాలకృష్ణ సుదీర్ఘంగా చర్చించటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలుపుకు నేతలు, శ్రేణులు ఎలా పనిచేయాలో కూడా ఉపదేశించారు లేండి.

జిల్లా పర్యటనలో బాలకృష్ణ సత్తుపల్లి నియోజకవర్గంలో సమీక్ష పేరుతో గంటలతరబడి నేతలు, శ్రేణులతో మాట్లాడటం ఆశ్చర్యంగానే ఉంది.  ఎందుకంటే, తెలంగాణాలో పార్టీని నిలబెట్టే విషయంలో నారా చంద్రబాబునాయుడు, లోకేషే చేతులెత్తేశారు. తెలంగాణాలో జరగబోతున్న ముందస్తు ఎన్నికల్లో ప్రచారానికి కూడా వచ్చేది లేదని స్వయంగా చంద్రబాబే నేతలతో స్పష్టంగా చెప్పారు. తానే కాకుండా లోకేష్ కూడా రారని నేతలతో చెప్పారట.

తెలంగాణాలో ప్రచారానికి వస్తే టిఆర్ఎస్ చీఫ్, ఆపద్దర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ ను టార్గెట్ చేయక తప్పదు. ప్రస్తుత పరిస్దితుల్లో కెసిఆర్ ను లక్ష్యం చేసుకుంటే ఏం జరుగుతుందో చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకే తెలంగాణా రాజకీయాల్లో అస్త్రసన్యాసం చేసేశారు. చంద్రబాబు, చినబాబే వదిలేసిన తెలంగాణాను బాలకృష్ణ టేకప్ చేశారా అన్న అనుమానాలు మొదలయ్యాయి. సత్తుపల్లి నియోజకవర్గంలో బాలకృష్ణ సమీక్ష చేయటమన్నది నిజంగా ఆయన తత్వానికి పూర్తి విరుద్దం. బాలయ్యకు సమీక్షలు చేసేంత ఓపిక, తీరిక లేదన్న విషయం అందరికీ తెలిసిందే.

నిజంగానే బాలయ్యకు అంత సీన్ ఉంటే సొంత నియోజకవర్గం హిందూపురంను అంత కంపు ఎందుకు  చేసుకుంటారు ? నాలుగున్నరేళ్లుగా హిందూపురంకు బాలయ్య ప్రాతినిధ్యం వహిస్తున్నా ఇప్పటి వరకూ నేతలతో కూర్చుని నియోజకవర్గంసై సమీక్ష చేసిన దాఖలాల్లేవు. బాలకృష్ణ తీరు వల్లే నియోజకవర్గంలో వర్గ విభేదాలు పెరిగిపోయి, పార్టీలో గొడవలు రోడ్డున పడ్డాయి. హిందూపురం నియోజకవర్గమంటే బాలకృష్ణ రాజ్యమైపోయింది. అందుకనే చంద్రబాబు కానీ చినబాబు కానీ జోక్యం చేసుకోవటం లేదు. ఈ నేపధ్యంలో వచ్చే ఎన్నికల్లో హిందూపురంలో బాలయ్య పోటీ చేస్తే గెలుస్తారా అన్నది అనుమానమే. వాస్తవాలు ఇలా వుండగా హిందూపురంను వదిలేసి తెలంగాణాలో బాలకృష్ణ పర్యటిస్తుండటం నియోజకవర్గం నేతలతో పరిస్దితిని సమీక్షించటంలో తెలంగాణా పగ్గాలను బాలకృష్ణ తీసుకున్నారా అన్న అనుమానాలు మొదలయ్యాయి.