రానున్న ఎన్నికల్లో హిందుపురం ఎంపిగా నందమూరి బాలకృష్ణ పోటీ చేయనున్నారా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే అనుకోవాలి. ప్రస్తుతం హిందుపురం ఎంఎల్ఏగా ఉన్న బాలయ్య పై పార్టీలోను, జనాల్లోను బాగా వ్యతిరేకతున్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఎంఎల్ఏగా ఇక్కడ నుండి పోటీ చేసేది అనుమానమే. హిందుపురంలో రానున్న ఎన్నికల్లో టిక్కెట్టు ఇవ్వటం లేదని బాలకృష్ణకు బావ కమ్ సిఎం కమ్ వియ్యంకుడు చంద్రబాబునాయుడు స్పష్టం చేశారని పార్టీ వర్గాలు చెప్పాయి.
అయితే, బాలకృష్ణ చూపంతా హిందుపురం నియోజకవర్గంపైనే ఉందట. అందుకే తాను ఇక్కడి నుండే పోటీ చేస్తానని కాబట్టి మరో అవకాశం ఇవ్వాలని అడిగారట. అందుకే మధ్యేమార్గంగా బాలయ్యను హిందుపురం ఎంఎల్ఏగా కాకుండా ఎంపిగా పోటీ చేయించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. ఎంఎల్ఏ అంటే ప్రతీరోజు జనాలతో టచ్ లోనే ఉండాలి. బాలయ్యకేమో అది సాధ్యం కావటం లేదు. ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే బాలయ్య నియోజకవర్గాన్ని గాలికొదిలేశారు. మొత్తం పెత్తనమంతా పిఏల చేతిలో ఉంచటంతో నియోజవర్గమంతా ఆగమైపోయింది.
నిజానికి హిందుపురం నియోజకవర్గమన్నది టిడిపి కంచుకోటల్లో కీలకమైనది. పార్టీ ఏర్పాటైన 1983 నుండి ఇఫ్పటి వరకూ ఒక్కసారి కూడా ఓడింది లేదు. టిడిపి తరపున ఎవరు నామినేషన్ వేసినా గెలవటమే. అలాంటి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న నియోజకవర్గాన్ని బాలకృష్ణ కంపు చేసేశారనే విమర్శ ఉంది. అనంతపురం పార్టీలో కూడా ఆయన దోరణి మీద అసంతృప్తి ఉంది.కంపు చేసిన వాడు హీరో బాలకృష్ణ కావడంతో ఎవరూ బయటకు ఏమీ అనలేని పరిస్థితి. ఇది పార్టీ అధినేత దృష్టికి వెళ్లినట్లు చెబుతున్నారు. దాంతో ఎంఎల్ఏ అభ్యర్ధిని మార్చక తప్పని పరిస్దితి వచ్చింది చంద్రబాబుకు. ఆయన్ని ఎంపిగా ఢిల్లీకి పంపిస్తే సరి అని బాబు అనుకుంటున్నట్లుతెలిసింది. మరి బాలయ్య ఎంపిగా పోటీ చేస్తే… ఎక్కడి నుంచి ? కొందరేమో హిందూపురం నుంచి ఆయనకు దూరం వెళ్లడం ఇష్టం లేదు కాబట్టి హిందూ పురం ఎంపిగానే ఆయన పోటీ చేస్తారని అనుకుంటున్నారు.
వచ్చేసారి హిందూపురం ఎంపిస్థానం ఖాళీ అవుతుందంటున్నారు. ఎందుకంటే సిటింగ్ ఎంపి కిష్టప్ప అసెంబ్లీకి రావావాలనుకుంటున్నారని వార్తలొస్తున్నాయ్.
హిందుపురం నియోజకవర్గానికే చెందిన సీనియర్ నేత, ఎంపిగా పోటీ చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్న అంబికా లక్ష్మీనారాయణ ఎం పి టికెట్ ఆశిస్తున్నారు. వైసిపి తరపున వాల్మీకి ఉపకులానికి చెందిన వ్యక్తి నిలబడే అవకాశం ఉన్నందునఅదే కులానికి చెందిన తనకు అవకాశం వస్తుందని లక్ష్మీనారాయణ ఆశిస్తున్నారు. ఆయన ఎప్పటి నుంచో టికె ట్ ఆశిస్తున్నారు. చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.
అయితే, ఇక్కడొక సమస్య ఉంది. ఇపుడు సిటింగ్ ఎంపి నిమ్మల కిష్టప్ప చాలా సీనియర్ నాయకుడు రెండు సార్లు ఎంపిగా గెలిచాడు. బిసి నేత. అందువల్ల ఆయన్ని తిరిగి పోటీ చేయిస్తారా లేక అసెంబ్లీకి తెస్తారా అనేది పార్టీలో చర్చనీయాంశమయింది.