ఫొటో చెప్పిన కథ..ఎవరైనా పట్టించుకుంటున్నారా ?

చంద్రబాబునాయుడుకు ఓ అలవాటుంది. అదేమిటంటే, గంటల తరబడి ఏదో ఓ విషయం చెబుతునే ఉంటారు. సమీక్షా సమావేశాలు కావచ్చు, మంత్రివర్గ సమావేశాలు కావచ్చు. లేకపోతే పార్టీ సమావేశాలు కూడా కావచ్చు. చెప్పిన విషయాన్నే తిరిగి తిరిగి చెప్పటం చంద్రబాబుకు బాగా అలవాటైపోయింది. తాజాగా కోలకత్తాలో కూడా అదే జరిగిందట. బిజెపియేతర పార్టీలతో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెండు రోజుల క్రితమే భారీ ఎత్తున కోల్ కత్తాలో ర్యాలీ నిర్వహించారు. సరే తర్వాత ఎలాగు బహిరంగసభ కడా జరిగింది లేండి. ఆ తర్వాతే నేతలకు మమత బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చేశారు.

ఆ విందులో జాతీయ పార్టీలకు చెందిన చాలామంది నేతలు పాల్గొన్నారు. మహారాష్ట్ర నుండి శరద్ పవార్, జమ్మూ కాశ్మీర్ నుండి ఫరూక్ అబ్దుల్లా, తమిళనాడు నుండి స్టాలిన్, ఉత్తరప్రదేశ్ నుండి మాయావతి, అఖిలేష్ యాదవ్, అజిత్ సింగ్, బీహార్ నుండి శరద్ యాదవ్ లాంటి వాళ్ళంతా విందులో పాల్గొన్నారు. అదే విందులో చంద్రబాబు కూడా పాల్గొన్నారు లేండి. మమతా దీదీ వంటకాలను వడ్డిస్తుంటే అందరూ శ్రద్ధగా విందును ఎంజాయ్ చేస్తున్నారు ఒక్క చంద్రబాబు తప్ప. మరి అందరూ విందులో బిజీగా ఉంటే చంద్రబాబు ఒక్కరు ఏం చేస్తున్నట్లు ?

అదే అర్ధం కావటం లేదు. ఫొటోలు కనిపిస్తున్నదాన్ని బట్టి అందరూ విందు చేయటంలో బిజీగా ఉంటే చంద్రబాబు వాళ్ళందరినీ ఉద్దేశించి ఏదో మాట్లాడుతున్నారు. చంద్రబాబైతే ఏదో మాట్లాడుతున్నారు కానీ ఫొటోలో కనిపిస్తున్న వాళ్ళల్లో ఒక్కరు కూడా  చంద్రబాబు మాటలను వింటున్నట్లు లేదు. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నట్లు ఫొటోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఎదుటి వాళ్ళు వింటున్నది లేంది చంద్రన్నకు అనవసరం. మనం మాట్లాడే అవకాశం వచ్చిందా లేదా అన్నదే ముఖ్యమన్నట్లుగా చంద్రబాబు రెచ్చిపోతున్నారు. దటీజ్ చంద్రబాబు. ఏమంటారు ?