మూడున్నరేళ్ళ క్రితం దేశంలో సంచలనం సృష్టించిన ఓటుకునోటు కేసులో చంద్రబాబునాయుడుపై తొందరలో చార్జిషీటు వేయనున్నారా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను అవే అనుమనాలు పెరిగిపోతున్నాయ్. ఓటుకునోటు కేసులో దర్యాప్తుకు ఎన్ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ రంగంలోకి దిగి వేం నరేందర్ కు నోటీసులిచ్చింది. వరంగల్ జిల్లాలోని అప్పటి టిడిపి నేత వేం నరేందర్ రెడ్డిని ఎంఎల్సీగా గెలిపించుకునేందుకు చంద్రబాబు నిర్ణయించారు. అందుకనే ఏ విధంగా చూసినా గెలిచే అవకాశం లేని వేం పోటీలో దిగారు.
గెలుపు అవకాశాలు లేని వేం కోసం ఎంఎల్ఏల ఓట్లను కొనేందుకు ప్లాన్ చేశారు. అందులో భాగంగానే నామినేటెడ్ ఎంఎల్ఏ స్పీఫెన్ సన్ ఓటును కొనుగోలు చేసేందుకు రూ 5 కోట్లతో బేరం కుదుర్చుకున్నారు. అందులో అడ్వాన్సుగా రూ 50 లక్షలు ఇచ్చేందుకు ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి స్టీఫెన్ ఇంటికి వెళ్ళి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. అప్పటి నుండి కేసు నత్తనడక నడుస్తునే ఉంది. కేసులో ఏసిబి ఇప్పటి వరకూ రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్ తదితరలను అరెస్టు కూడా చేసింది. ప్రస్తుతం వాళ్ళంతా బెయిల్ పై బయటున్నారు.
ఈ కేసులో పాత్రదారులు కాకుండా అసలు సూత్రదారుడు చంద్రబాబే అంటూ అప్పట్లో కెసియార్ అండ్ కో ఎన్నోసార్లు బహిరంగంగనే ఆరోపణలు చేశారు. చంద్రబాబు అరెస్టు తప్పదని బ్రహ్మదేవుడు దిగొచ్చిన చంద్రబాబును కాపాడలేడని కెసియార్ ఎన్నోసార్లు చెప్పారు. అందులో భాగంగా చంద్రబాబును విచారించేందుకు ఏసిబి రెడీ అయితే విచారణను అడ్డుకుంటు చంద్రబాబు కోర్టులో స్టే తెచ్చుకున్నారు. అప్పటి నుండి కేసు విచారణ నత్తను తలపిస్తోందనే అనుకోవాలి.
అటువంటిదిత హఠాత్తుగా ఎన్ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ రంగంలోకి దిగి వేంకు నోటీసులివ్వటం ఆశ్చర్యంగా ఉంది. వేం విచారణ తర్వాత చంద్రబాబు మీద కూడా చార్జిషీటు దాఖలు చేయటానికి ఏసిబి రెడీ అవుతోందని సమాచారం. ఈ కేసులో అసలు సూత్రదారుడు చంద్రబాబే అనేందుకు స్పీఫెన్ సన్, చంద్రబాబు మధ్య జరిగిన ఫోన్ సంభాషణలే రుజువనని ఏసిబి అంటోంది. ఏదేమైనా ఇంతకాలం ఏదో ఓ రూపంలో విచారణను చంద్రబాబు అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. వేం విచారణ తర్వాత కేసులో స్పీడు పెరిగి సరిగ్గా ఎన్నికలకు ముందు చంద్రబాబు మీద గనుక చార్జిషీటు ఓపెన్ అయితే సంచలనమే.