ఆ జిల్లాలో 12 మంది ఎంఎల్ఏలపై నెగిటివ్ రిపోర్టా ?

ఎన్నికలు దగ్గర పడుతున్న నేపధ్యంలో ఎంఎల్ఏలపై చంద్రబాబునాయుడు సర్వేల జోరు పెరిగింది. ఒకవైపు పార్టీ పరంగా సర్వేలు చేయిస్తూనే ఇంకోవైపు ఇంటెలిజెన్స్ రిపోర్టులు కూడా ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నారు. అందులో భాగంగానే తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించిన సర్వే రిపోర్టు చూసి చంద్రబాబే ఆశ్చర్యపోయారట. జిల్లాలో 19 నియోజకవర్గాలున్నాయి.  పోయిన ఎన్నికల్లో టిడిపి 13 నియోజకవర్గాల్లో గెలవగా, వైసిపి 5 చోట్ల గెలిచింది. ఒకచోట స్వతంత్ర అభ్యర్ధి గెలిచారు. సరే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారో అందరికీ తెలిసిందే.

సరే ఎంఎల్ఏలు అందరిపైనా చంద్రబాబు ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటూనే ఉన్నారు. అయితే, ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాదా ఇపుడు ఒకటికి పది మార్గాల్లో సర్వేలు చేయించుకుంటున్నారు. అందులో భాగంగానే ఈమధ్య టిడిపి ఎంఎల్ఏలపై  ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు అందించిన రిపోర్టు చూసి చంద్రబాబే నివ్వెరపోయారట. జిల్లాలోని టిడిపి ఎంఎల్ఏల్లో దాదాపు 12 మంది మీద పూర్తిగా నెగిటివ్ రిపోర్టు వచ్చిందట. ఇందులో ఫిరాయింపు ఎంఎల్ఏలు కూడా ఉన్నారు లేండి.

మొత్తం 12 మంది ఎంఎల్ఏల్లో 8 మంది ఎంఎల్ఏలపై ఇసుక,మట్టి అక్రమ సంపాదనకు సంబంధించిన డీటైల్డ్ రిపోర్టుందట. ఈ నాలుగున్నరేళ్ళలో ఎవరెవరు ఎంతెంత సంపాదించారన్న  పూర్తి వివరాలున్నాయట. అలాగే, నియోజకవర్గాల్లో పార్టీ పరంగా కావచ్చు లేదా జనాల్లో కావచ్చు వారికున్న బ్యాడ్ ఇమేజ్ ను కూడా వివరించారట. ప్రజా సమస్యలను గాలికొదిలేసి, సంపాదనే ధ్యేయంగా ఎలా రెచ్చిపోయారో ఆధారాలతో సహా వివరించారట. మిగిలిన నలుగురు శాసనసభ్యుల ఆదాయ మార్గాలను కూడా రిపోర్టులో చెప్పారట.

వచ్చే ఎన్నికల్లో పై 12 మందికి టిక్కెట్లిస్తే గెలవటం కష్టమేనని అందుకు ప్రత్యామ్నాయంగా కొందరు నేతల పేర్లను కూడా ప్రస్తావించారట. సొంతంగా చంద్రబాబు తెప్పించుకుంటున్న నివేదికలు, ఇంటెలిజెన్స్ సమర్పించిన నివేదికలోని అంశాలు దాదాపు ఒకటేలా ఉన్నట్లు చంద్రబాబు గుర్తించారట. కాబట్టి ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 మంది నియోజకవర్గాల్లో ఏం చేయాలనే విషయంపై చంద్రబాబు సీరియస్ గా దృష్టి పెట్టినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. మరి, ఎంతమందికి టిక్కెట్లిస్తారో చూడాల్సిందే.