జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాను పోటీ చేసే నియోజకవర్గం విషయంలో ఏదో కన్ఫ్యూజన్లో ఉన్నట్లుంది. అందుకే ఒక్కోసారి ఒక్కో నియోజకవర్గం పేరును ప్రచారంలోకి తీసుకొస్తున్నారు. తాజాగా కాకినాడ సిటి, కాకినాడ రూరల్, పిఠాపురం నియోజకవర్గాల్లో పోటీ చేయటానికి పవన్ ఆసక్తి చూపుతున్నట్లు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటి సభ్యుడు ముత్తా గోపాలకృష్ణ ప్రకటించారు. ముత్తా కూడా ఏకంగా మూడు నియోజకవర్గాలను ప్రకటించటమే ఆశ్చర్యంగా ఉంది. మామూలుగా అయితే ఓ పార్టీ అధినేత ఏ నియోజకవర్గం నుండైనా పోటీ చేసి గెలవగలిగిన సత్తా కలిగి ఉండాలి.
అసలు తాను పోటీ చేయబోయే నియోజకవర్గంపైన పార్టీ అధినేత స్పష్టమైన అవగాహన కలిగి ఉంటారని అందరూ అనుకుంటారు. కానీ విచిత్రంగా పవన్ లో మాత్రం ఎందుకో బాగా అయోమయం కనిపిస్తోంది. తాను అనంతపురం నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా స్వయంగా పవనే ఒకపుడు ప్రకటించారు. తర్వాత తన ఓటు హక్కును ఏలూరులో నమోదు చేసుకున్నారు. దాంతో అందరూ పవన్ ఏలూరు నియోజకవర్గం నుండే పోటీ చేస్తారని అనుకున్నారు. తర్వాత ఉత్తరాంధ్రలో పర్యటించినపుడు తనకు పాడేరు నియోజకవర్గం నుండి పోటీ చేయాలనుందని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆశ్చర్యమెందుకంటే, పాడేరు ఎస్టీ నియోజకవర్గం కాబట్టి, ఇతరులు పోటీ చేసే అవకాశం లేదు కాబట్టే.
తర్వాత ఇచ్ఛాపురం నియోజకవర్గం అన్నారు. ఉత్తరాంధ్రలో ఏదో ఓ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని ఉందన్నారు. తిరుపతి నుండే తనను పోటీ చేయాలంటూ తన అభిమానులు ఒత్తిడి పెడుతున్నట్లు చెప్పారు. సరే తిరుపతి అంటే ఒకపుడు సోదరుడు చిరంజీవి ప్రాతినిధ్యం వహించారు కాబట్టి సెంటిమెంటుగా అక్కడి నుండే పోటీ చేస్తారేమో అనుకున్నారు. తర్వాత తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో పిఠాపురం నుండే పోటీ చేయాలని ఉందని చెప్పారు. ఇపుడేమో ముత్తా మాట్లాడుతూ, కాకినాడ సిటీతో పాటు కాకినాడ రూరల్ నియోజకవర్గాలను కూడా కలిపారు.
ఇంతకీ పవన్ ఎక్కడి నుండి పోటీ చేస్తున్నారో ఎవరూ చెప్పలేకున్నారు. మరో ఏడు మాసాల్లో ఎన్నికలు వచ్చేస్తున్నాయ్. ఇంకా పోటీ చేయబోయే నియోజకవర్గంపై ఓ క్లారిటీ లేకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. మామూలుగా అయితే అధినేతలు తాము ఏ నియోజకవర్గం పరిధిలోకి వస్తారో అక్కడి నుండే పోటీ చేయటం సహజం. అప్పుడెప్పుడో ఎన్టీయార్ టిడిపి పెట్టినపుడు సొంత నియోజకవర్గం గుడివాడను కాదని తిరుపతి, హిందుపురం నుండి పోటీ చేసి గెలిచారు. తర్వాత 1994లో టెక్కలిలో పోటీ చేసి గెలిచారు.
కాంగ్రెస్ లో కీలకంగా ఉన్నంత కాలం దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కు పులివెందులలో తిరుగేలేదు. సొంత నియోజకవర్గం చంద్రగిరిని కాదని చంద్రబాబునాయుడు కుప్పంకు వలస దశాబ్దాల క్రితమే వెళ్ళి స్దిరపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిది వాయల్పాడు నియోజకవర్గం. ఇలా ఎవరిని చూసినా ఓ స్ధిరమైన నియోజకవర్గం ఉంది. మరి అటువంటి నియోజకవర్గం పవన్ కల్యాణ్ కుందా ? ఏదో ఓ నియోజకవర్గాన్ని ప్రకటించి జనాల్లోను, పార్టీలోను అయోమయాన్ని తొలగిస్తే పవన్ కే మంచిది.