ఈ సమాజాన్ని.. పాలకుల్ని రెండు కోణాల్లో చూడాలని అంటారు. ఒకటి క్యాపిటలిస్ట్ ఐడియాలజీ.. రెండోది కార్మికులు.. పేద బీద బడుగు బక్క ప్రజలు అనే కోణంలో చూడాలని కమ్యూనిస్టులు చెబుతుంటారు. పేదలే అసలైన ప్రజలు అనేది కమ్యూనిజం భావజాలం. ఆ కోవలో చూస్తే విభజిత ఆంధ్రప్రదేశ్‌ని పాలించిన వాళ్లలో ఇప్పటివరకూ పేదల వైపు ఉన్నది ఎవరు? పెద్దలు గద్దల వైపు ఉన్నది ఎవరు? అన్నది చూస్తే కచ్ఛితంగా రాజధాని పేరుతో రియల్ వెంచర్లకు ప్లాన్ చేసిన చంద్రబాబు అనే క్యాపిటలిస్టును.. పేదలు- రైతులు- సామాన్యులు అని ఆలోచిస్తున్న ప్రస్తుత సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్న తేడా ఏంటో తెలిసొస్తుంది.
క్యాపిటలిస్ట్ చంద్రబాబు ఎంతసేపూ రాజధాని పేరుతో దోపిడీకి ప్లాన్ చేశారని.. పరిశ్రమలు పేరుతో క్యాపిటలిస్టుల్ని పెంచి పోషించాలని చూశాడని.. అందుకే అసలైన ప్రజలు- రైతులు (58శాతం ఉన్నారు) ఎంతమాత్రం క్షమించలేదని గత ఎన్నికలు నిరూపించాయి. ఏపీలో ప్రజలంతా యునానిమస్ గా జగన్ కి ఓట్లు వేసి గెలిపించడం వెనక అసలు కారణం ఇదే. నవరత్నాలు పేరుతో ఆకర్షణీయమైన సంక్షేమ పథకాల్ని ప్రకటించి ఆకట్టుకున్నారు జగన్. అప్పటికి ప్రజలకు ఉన్న ఏకైక ఆప్షన్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వారసుడు మాత్రమేనని అంతా నమ్మారు. అయితే జగన్ ఏడాది పాలనలో ఏం తేలింది? అన్నది చూస్తే.. అతడు పేదల తరపున ఆలోచించాడని.. రైతులకు చేరువగా పాలనను తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నాడని జనం నమ్ముతున్నారు.
అది పల్లెల్లో ప్రత్యక్షంగానే కనిపిస్తోంది. ఇక పేదలు.. రైతులు.. బడుగు బలహీన వర్గాలు.. వృద్ధులు.. నిరుద్యోగులు .. ఇలా ఏ కోణంలో చూసినా వీరంతా జగన్ వల్ల లబ్ధిదారులుగా ఉన్నారు. ఒకరకంగా ఇదంతా ఓటు బ్యాంకుగా మారుతోందన్న విశ్లేషణ ఇటీవల సాగుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కచ్ఛితంగా వీరంతా వైయస్సార్ సీపీ తరపున నిలబడాల్సిన సన్నివేశం ఉంది.
ఇప్పుడు జగన్ చేసే ప్రతి సంతర్పణ వెనక ఇక టీడీపీకి ఏమీ మిగలకూడదనే ధ్యేయం కనిపిస్తోందని విమర్శలు ఉన్నా… నిజంగా అదే జరుగుతున్నా.. దీనివల్ల అంతో ఇంతో ప్రజల జేబుల్లోకే వెళుతోంది. జగన్ వల్ల కొంతవరకూ మేలు ఇది అని కూడా నమ్ముతున్నారు. రైతు ప్రభుత్వం అని ముందే చెప్పినట్టే రైతుల ఖాతాలోకి జమ అవుతున్న ప్యాకేజీలు (వేలల్లో సాయం) కొంతవరకూ ఊరట అనే చెప్పాలి. రైతుల పంటకు భీమా.. అలాగే పంట కొనుగోళ్లు.. ఎరువులు.. విత్తనాలు ఊరికే చేరే ఏర్పాటు.. రైతు భరోసా కేంద్రాలు.. రైతు క్రెడిట్ కార్డులు అంటూ చాలానే చేస్తున్నారు. వృద్ధులకు ఫించను ఇళ్లకే తెచ్చి అందిస్తున్నారు వలంటీర్లు. ఆడాళ్ల రక్షణ కోసం ప్రతి గ్రామానికి ఒక లేడీ పోలీస్ ఏర్పాటు చేస్తున్నారు. ఉద్యోగాల్ని క్రియేట్ చేశారు. వరుసగా ఉద్యోగ ప్రకటనల్ని వెలువరిస్తున్నారు. చంద్రబాబులా వృధా నాటకాలాడలేదు ఏనాడూ.
జగన్ వస్తూనే ప్రతి ఊరిలో కనీసం 5-10 మందిని ప్రభుత్వోద్యోగుల్ని చేశాడు.. రూ10- రూ15 వేల మధ్య జీతం ఇస్తున్నారు. భవిష్యత్ లో పేస్కేల్ పెరిగే వీలుంది. వలంటీర్లు.. సెక్రటరీలు.. సహా విలేజ్ లెవల్లో సేవలు చేసే ఉద్యోగుల్ని సృష్టించారు. ఒకప్పుడు టీచర్ ఉద్యోగాల పేరుతోనే ఏళ్లకు ఏళ్లు ఎదురు చూసిన నిరుద్యోగులెందరో వలంటీర్లుగా ఎంపికయ్యారు. అందుకే ఈ సీఎం దేవుడు కాదంటారా? అని నిరుద్యోగులు అతడికి పట్టంగడుతున్నారు. పల్లెటూళ్లలో అసలు గవర్నమెంటు ఆఫీసు అనేది ఉందనే తెలీదు ఇంతకుముందు.. పంచాయితీ ఆఫీసుల పని తీరు ఎలా ఉండేదో కూడా అయోమయంగా ఉండేది. కానీ ఇప్పుడలా లేదు. కొంతవరకూ ప్రజాసేవ పారదర్శకంగా కనిపిస్తోంది.
ఇక ఇతర సేవలోనూ వైసీపీ పాలనలో అంతే ఒరవడి. ప్రజలు ఏదైనా పని కావాలంటే రెవెన్యూ (ఎమ్మార్వో- ఎంపీడీవో) ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అక్కడ నెలల తరబడి ఏ పనీ అయ్యేది కాదు. అలాంటిది ఇప్పుడు వలంటీర్లు నేరుగా ఇళ్లకే వచ్చి సేవలందిస్తున్నారు. ఒక రకంగా జగన్ చెప్పింది చేసి తీరుతున్నాడు.
ఇప్పుడు అధికారులే (సెక్రటరీలు.. కార్యదర్శులు.. వీఆర్వోలు) ప్రజల దగ్గరకే వస్తున్నారు. ప్రతి సమస్యా వింటున్నారు.. కరోనాలో ది బెస్ట్ సర్వీస్ చేశారు.. ఒకవేళ బాబు సీఎంగా ఉంటే ఈపాటికే సగం మంది కరోనాతో చచ్చేవారు ఏపీలో.. అన్న చర్చా ఇటీవల తెరపైకొచ్చింది. జగన్ దూరపు చూపు వల్లనే ఈ విపత్తు వేళ ప్రజలకు ఎంతో మేలు జరిగిందన్న విశ్లేషణా సాగుతోంది. ఒక రకంగా ఇవన్నీ సక్సెస్ కావడం కూడా టీడీపీ వాళ్ల ఏడుపుకి కారణమవుతోంది. పాలన అన్నాక చిన్నపాటి లోటుపాట్లు ఉంటాయి. అవి జగన్ పాలనలోనూ లేకపోలేదు. కానీ ఆయన ప్రామిస్ చేసిన నవరత్నాలు (సంక్షేమ పథకాలు) అమలు చేసేందుకు ఏమాత్రం వెనకాడడం లేదు.
ఇదొక్కటేనా ప్రజలకు ఆపద వచ్చింది అంటే అవిభాజిత ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో కానీ విభజిత ఏపీ చరిత్రలో కానీ ఎన్నడూ లేనంతగా జగన్ స్పందిస్తున్నారు. మొన్న వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో చనిపోయిన కుటుంబాలకు 1కోటి సాయం ప్రకటించి నెవ్వర్ బిఫోర్ అన్న ప్రశంసలు అందుకున్నారు. ఇంతవరకూ ఏ సీఎం ప్రకటించని ప్యాకేజీ ఇది. ఫ్యాక్టరీ పరిసర గ్రామాల్లో ప్రతి కుటుంబానికి 10వేలు ఖాతాలో వేసిన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. చిన్నపాటి లోటు పాట్లను పట్టుకుని చంద్రబాబు నాటకాలాడాలని దుష్ప్రచారం చేయాలని చూసినా ఏదీ ప్రజలు పట్టించుకోలేదు.. అసలు ఆ ఇన్సిడెంట్ సమయంలో ప్రతిపక్షాలకు నోరెత్తే అవకాశమే ఇవ్వలేదు జగన్. అలాగే నవరత్నాల్ని అమలు చేయడంలో సక్సెసవ్వడంతో విపక్ష నేత జనసేనాని పవన్ కల్యాణ్ సైతం తన ఆలోచన మార్చుకుని సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారని ఇటీవల ప్రజలే మాట్లాడుకుంటున్నారు.
ఇక సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రభుత్వ భూముల అమ్మకానికి జగన్ ప్రయత్నించారు. దీనిపై తేదేపా- భాజపా ఇతర పార్టీలు నానా రాద్ధాంతం చేశాయి. ఒకవేళ ఇప్పుడు అమ్మక పోతే తేదేపా వాళ్లు రాగానే అమ్ముతారు.. తర్వాత అమరావతి రియల్ ఎస్టేట్ లో ఆ డబ్బు పెడతారు.. దానివల్ల ఎవరికి ఉపయోగం?.. బాబు రియల్ ఎస్టేట్ లో ఫ్లాట్లు కొనేది మళ్లీ ప్రజలు వీళ్ల పిల్లలు.. అంటే డబ్బు ఎవరి ఖాతాలోకి వెళుతుంది? అన్నది ఊహించేదే.
హైదరాబాద్ లో చంద్రబాబు- మురళీ మోహన్ జయభేరి రియల్ ఎస్టేట్స్ లో ఫ్లాట్లు కొనేది ఎవరు? సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఆ ఉద్యోగాలు ఇచ్చే ఎన్నారైలు అన్నది అందరికీ తెలిసిందే. ఇక ఏపీ- తెలంగాణలో అన్నిచోట్ల నుంచి హైదరాబాద్ రాజధానికి ఉద్యోగాల పేరుతో వచ్చి అపార్ట్ మెంట్లు కొనడం వల్ల చంద్రబాబు- మురళీ మోహన్ వెంచర్లు లాభపడేవి. ఇప్పుడు రాజధాని అమరావతిలో నిర్మిస్తే రియల్ బిజినెస్ ఇక్కడ అదే తీరుగా అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు బినామీ వెంచర్లలోనే ప్రజలు వారి వారసులు పెట్టుబడులు పెట్టాలి. ఇక్కడ కంపెనీల్లో ఉద్యోగాలు చేసి ఈఎంఐలు కట్టాల్సి ఉంటుంది.
అంటే దీనర్థం ఏమిటి? ప్రజల సొమ్ములన్నీ తిరిగి బాబు అకౌంట్లోకే వెళతాయి.. అది కూడా రాజమార్గంలో!! ఆయన వేల లక్షల కోట్ల అధిపతి అవుతాడు.. ప్రజలేమో చెంచాలు అవుతారు.. రైతు అకౌంట్లో ఏనాడైనా రూ.10 అయినా వేశారా బాబుగారు ఇలాకాలో? ఎన్నారైలు దేవుళ్లు.. కనీసం ఇండియాలో రూ.10 వేల ఉద్యోగం ఇచ్చి మన పిల్లలకు ఉపాధి కల్పించాలి అని ఆలోచిస్తారు. కనీసం ఆపాటి ఆలోచన అయినా బాబు పాలనలో చేశారా? నిరుద్యోగులంతా కళ్లు కాయలు కాసేలా చూసి విసిగిపోయారు. రైతులు అయితే అసలు పాలకులతో పనేం ఉంది అన్నట్టే కాలం వెళ్లదీసేవారు. అందుకే గత ఎన్నికల్లో గంపగుత్తగా వైయస్ జగన్ కి ఓట్లు వేశారు. కుటుంబ సమేతంగా ఓట్లు మళ్లించి వైకాపాకి పట్టంగట్టారు. విలేజీలకు తేదేపా నాయకులు వస్తే తన్ని తరిమేస్తారు అన్నంతగా పరిస్థితి వెళ్లింది. ఇలాంటి రకరకాల కారణాలతోనే చంద్రబాబు పూర్తిగా తగ్గిపోయారు. జగన్ డాంభీకం ముందు బాబు కానీ ఇతర పార్టీలు కానీ తలొంచాల్సి వస్తోందన్న టాక్ కూడా ప్రజల్లో ఉంది. ఏడాది జగన్ పాలన చూస్తే ఇలాంటి కఠోర సత్యాలెన్నో అందరూ గ్రహించాల్సి ఉంటుంది.