మూడు రాజధానులు, సీఆర్ డీఏ బిల్లు రద్దుపై ఏపీలోని పలు జిల్లాల్లో నిన్నటి నుంచి జరుగుతోన్న రచ్చ గురించి తెలిసిందే. గవర్నర్ ఆమోదంతో చట్టరూపం దాల్చిన మూడు రాజధానులు నిర్ణయంతో అమరావతి రైతులు మరోసారి భగ్గుమన్నారు. అమరావతిలో రైతులు నిరసనలకు పిలుపునిచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక టీడీపీ పార్టీ రాష్ర్టంలోని అన్ని జిల్లాల్లో నిరసనలు మిన్నంటేలా చేస్తోంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర సహా అన్ని జిల్లాల్లో టీడీపీ కార్యాలయాల ముందు కార్యకర్తలు, నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. తుళ్లూరులోని రైతులు ఒకే రాజధాని..సేవ్ అమరావతి అంటూ పోరాటానికి దిగారు.
అటు సీపీఎం నేతలు రాష్ర్ట వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గట్టిగానే స్వరం వినిపిస్తున్నారు. మరి ఇంత జరుగుతున్నా! ఈ నిరసనలు..ఆందోళనలు వల్ల ఒరిగేదేమైనా ఉందా? అంటే కచ్చితంగా లేదనే చెప్పాలి. మూడు రాజధానులు, సీఆర్ డీ ఏ బిల్లు రద్దు వ్యవహారమంతా రాజ్యాంగబద్దంగానే జరిగింది. ఇందులో ఎక్కడా రాజ్యాంగాన్ని మీరి చేసింది లేదు. అయితే ఈ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు హైకోర్టుకు వెళ్తాం…సుప్రీం కోర్టులో కేసులు వేస్తామని మరో పక్క హడావుడి చేస్తున్నా సాధ్యాసాధ్యాలు ఏంటన్నది ఆయనకి తెలియకుండా ఉండదుగా. కాబట్టి ఈ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు ఈ విధంగా ముందుకెళ్లడం అన్నది కాలయాపన తప్ప సాధించేది ఏమీ ఉండదు అన్నది నిపుణుల మాట.
మరి ఇప్పుడెలా అంటే? చంద్రబాబు ముందు మరొక దారి ఉందని గట్టిగా వినిపిస్తోంది. నేరుగా చంద్రబాబు నాయుడు అమరావతి నడిబొడ్డునన..బెంజి సర్కిల్లో ఆమరణ నిరాహార దీక్షకు దిగితే కాస్తో !కూస్తో! ఫలితం ఉంటుందంటున్నారు. సాధారణ దీక్షలుకంటే ఆమరణ నిరాహార దీక్షలు రాజకీయాల్లో బాగా బలంగా పనిచేస్తాయి అన్నది నిపుణుల వాదన. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం..నాలుగు దశాబ్ధాల రాజకీయ చరిత్ర చంద్రబాబు సొంతం కాబట్టి దీక్షకు దిగితే బలమైన నాయకుడిగా ఆవిర్భవించడానికి ఆస్కారం కూడా ఉందని అంటున్నారు. అదీ తెలంగాణ ఉద్యమం తరహాలో పచ్చ తమ్ముళ్లు కూడా అన్ని జిల్లాల్లో ఆమరణ నిరాహార దీక్షలకు పూనుకుంటే? ఎందుకు సాధ్యపడదు? అన్నది కొంత మంది వాదన.
తెలంగాణ రాష్ర్టాన్ని అక్కడి ప్రజలు, కేసీఆర్ అలా సాధించుకున్నదే కదా. అప్పటివరకూ ఈటెల రాజేందర్, హరీష్ రావులు, కోదండరాం ప్రజలు చేసిన ఉద్యమం ఓ ఎత్తెతే.. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగడంతో ఉద్యమం రూపమే మారిపోయింది. ఆయన ప్రాణం మీదకు తెచ్చుకున్న తర్వాతే కదా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేసింది. కేసీఆర్ ఆ ఉద్యమాన్ని అమరజీవి నెల్లూరు పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో చేపట్టి సాధించారు అన్నది తెలిసిందే. కాబట్టి చంద్రబాబు ఈ విధంగా అమరావతి ప్రజల్ని, తమ అనుకూల వర్గాన్ని, నేతల్ని , కార్యకర్తల్ని రాష్ర్ట వ్యాప్తంగా కూడగడితే కేంద్రం ఆలోచించే అవకాశం లేకపోలేదు. అమరావతి శంకుస్థాపన ఎలాగూ ప్రధాని మోదీ చేతుల మీదుగానే జరిగింది కదా. కాబట్టి పెద్దాయన ఆలోచించే అవకాశం ఉందంటున్నారు. అదిష్టానం తలుచుకుంటే కోర్టులు..సెక్షన్లు..చట్టాలు అన్ని తారుమారే అనడానికి భారతదేశంలో ఎన్నో ఉదాహరణలున్నాయి.