Investments For AP: ఏపీకి భారీ పెట్టుబడులు.. వైసీపీ హయాంలో వెనక్కి వెళ్లిన కంపెనీ కూడా మళ్ళీ రీ ఎంట్రీ!

ఏపీ ప్రభుత్వం పారిశ్రామిక వృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తూ భారీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. కూటమి ప్రభుత్వ ఆరంభం నుండి ఇప్పటి వరకు దాదాపుగా రూ.7 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదరగా, వీటి ద్వారా లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. తాజాగా జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశంలో ప్రభుత్వం మరోసారి కీలక పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ సమావేశంలో మొత్తం రూ.1.21 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. మొత్తం 10 ప్రాజెక్టులు అమలు కానుండగా, వీటి ద్వారా 80,104 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. అంతేకాదు, రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో చిన్న, మధ్య తరహా పరిశ్రమల ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలపడే అవకాశం ఉంది.

ఇంకా, రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఒక్క నెల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 5 ఇన్నోవేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా యువతకు వివిధ రంగాల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు, ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.

లులూ గ్రూప్ తిరిగి ఏపీలోకి వచ్చేందుకు సిద్ధమవ్వడం మరో ముఖ్యమైన పరిణామం. విశాఖపట్నంలో భారీ షాపింగ్ మాల్‌ను ఏర్పాటు చేసేందుకు రూ.1,500 కోట్ల పెట్టుబడిని ప్రణాళికలోకి తెచ్చింది. గతంలో లులూ వైసీపీ తీరు వలన వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. మరోసారి ఏపీలో పెట్టుబడులు పెట్టమని చెప్పగా ఇప్పుడు చంద్రబాబు అదే సంస్థను తిరిగి ఏపీకి తీసుకు రావడం విశేషం. అదేవిధంగా, దాల్మియా గ్రూప్ కడప జిల్లాలో భారీ సిమెంట్ కర్మాగారాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ పెట్టుబడులు రాష్ట్ర అభివృద్ధికి మద్దతుగా నిలవనున్నాయని పరిశ్రమల వర్గాలు అంటున్నాయి.