ఈసారి అధికారంలోకి రాకపోతే ఇక శాస్వతంగా రానట్లే అనేస్థాయిలో బలంగా ఫిక్సయిన టీడీపీ అధినేత… ప్రచారంలో తన సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే కుమారుడు లోకేష్ బాబుని పాదయాత్రకు పంపిన చంద్రబాబు… వరుసగా బహిరంగ సభలు పెడుతూ కేడర్ లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా కొత్త చర్చను తెరపైకి తెస్తున్నారు తమ్ముళ్లు. దానికి కారణం… చంద్రబాబు తాజా పర్యటనలో జనాలు తండోపతండాలుగా రావడం!
అవును… నాలుగురోజుల క్రితం మచిలీపట్నం, గుడివాడ నియోజకవర్గాల్లో బాబు సభలు ఏర్పాటుచేశారు. కానీ ఊహించిన స్థాయిలో జనాలు హాజరుకాలేదు. దీంతో… సభలో ఖాళీ కుర్చీలకు బాబు ప్రసంగాలు చేశారంటూ అధికారపార్టీ నేతలు ఎద్దేవా చేశారు. అదో పెద్ద సమస్యగా మారిన పరిస్థితి. దీంతో… బాబుని జనం నమ్మడం లేదని అధికార పార్టీ వాయిస్ ని పెంచింది.
అదోరకం సమస్య అనుకుంటే… కొన్నాళ్ల కిందట తూర్పుగోదావరిలో నిర్వహించిన రోడ్ షోకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు. దీంతో రోడ్లన్నీ కూడా నిండిపోవడంతో రోడ్ షో కేవలం కిలో మీటరు దూరానికి నాలుగు గంటలు పట్టింది. ఇప్పుడు తాజాగా గిద్దలూరు నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్ షోలో కూడా రెండు కిలో మీటర్ల దూరాన్ని దాటుకుని వెళ్లేందుకు కనీసం 3 గంటలకు పైగానే సమయం పట్టిన పరిస్థితి. అంటే… జనాలు అద్భుతంగా వచ్చారని చెబుతున్నారు!
దీంతో… గత అనుభవాలను గుర్తుకు తెచ్చుకుంటున్నారట తమ్ముళ్లు. 2019 ఎన్నికలకు ముందు కూడా ఇలానే ప్రజలు చంద్రబాబు సభలకు పోటెత్తారు. టీడీపీ పాలనపై హర్షం తెలియచేస్తూ సెల్ ఫోన్ లైట్స్ వెలిగించి హర్షం తెలపడం.. చప్పట్లు కొట్టడం వంటివి చేశారు. ఇక మహిళలు అయితే “జయము జయము చంద్రన్న..” అంటూ పాటలు పాడారు. దీంతో ఇంకేముంది పార్టీ విజయం ఖాయమని చంద్రబాబు నమ్మారు. గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. తీరా ఎన్నికల ఫలితాలొచ్చిన తర్వాత సీన్ మొత్తం రివర్స్!
దీంతో… తన ఓటమికి కారణాలేమిటో తెలియడం లేదని బాబు వ్యాఖ్యానించిన పరిస్థితి. దానికి, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆ విషయాన్ని మసిపూసి మారెడుకాయ చేసిన ఒక వర్గం మీడియా ఒక కారణం అయితే… ఆ విషయాన్ని చంద్రబాబుకు తెలియజెప్పకపోయిన స్థానిక నాయకత్వం మరో కారణం. జనసమీకరణే ముఖ్యం అని వారు నాడు భావించారే తప్ప… వచ్చిన జనం వెళ్తూ వెళ్తూ ఏమి మాట్లాడుకుంటున్నారన్న విషయంపై శ్రద్ధ పెట్టలేదు! ఫలితం… 2019 లో చూసిందే!
దీంతో… ఇప్పుడు కూడా స్థానిక నాయకులు జనసమీకరణపై మాత్రమే దృష్టి పెట్టి బాబును ఏమారుస్తున్నారా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారంట కొందరు తమ్ముళ్లు. ఈసారి అలా జరగకుండా జాగ్రత్త పడాలని వారు సూచిస్తున్నారంట. జనసమీకరణపై శ్రద్ధ పెట్టడం తప్పుకాదు కానీ… వచ్చే జనాల నాడిని పట్టుకోకపోతే అంతా అద్భుతంగా కనిపిస్తాదని… ఫలితాలు మాత్రం గూబలు వాయించేస్తాయని చెబుతున్నారంట. ఇలా జనాలు రాకపోతే ఒకరకమైన టెన్షన్ పడుతున్న తమ్ముళ్లు… జనాలు విపరీతంగా వచ్చినా కూడా ఈ కొత్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు!