వైసిపికి ఎన్ని సీట్లొస్తాయి ? ఇవేనా లెక్కలు ?

ఇపుడిదే విషయమై జనాల్లో బాగా చర్చ జరుగుతోంది. ఓటర్ల మధ్య చర్చ, సామాన్య జనాల్లో నలుగుతున్న చర్చలను పక్కనపెడితే వైసిపి శ్రేణులు మాత్రం మంచి జోష్ తో ఉన్నాయి. వైసిపి నేతల లెక్కప్రకారం చూస్తే రాబోయే సీట్ల విషయంలో మూడు రకాలుగా లెక్కలేసుకుంటున్నారు.

మొదటిది 60 శాతం పోలింగ్ అయితే ఎన్ని సీట్లు వస్తాయ్ ?  ఓటింగ్ శాతం 60 దాటితో తమ పార్టీకి 110 సీట్లు వస్తాయట. అలాగే ఇక రెండో అంచనా ప్రకారం 70 శాతం దాటితే  120 సీట్లు వస్తాయట. మూడో లెక్క ప్రకారం ఓటింగ్  80 శాతం దాటితే 130 స్ధానాలు వస్తాయని. ఇపుడీ అంచనాలే సోషల్ మీడియాలో కూడా బాగా హల్ చల్ చేస్తున్నాయి. నిజానికి పోలింగ్ శాతంపై ఎన్నికల సంఘమే ఇప్పటి వరకూ అధికారికంగా ప్రకటన చేయలేదు.

ఏదేమైనా పోలింగ్ 80 శాతం దాటిపోయే అవకాశమైతే ఉందని సమాచారం. ఎందుకంటే, గురువారం ఉదయం 7 గంటలకు మొదలై ఓటింగ్ అర్ధరాత్రి దాటిన తర్వాత కానీ పూర్తికాలేదు. అర్ధరాత్రి ఓటింగ్  పూర్తయిన పోలింగ్ కేంద్రాల నుండి శుక్రవారం మధ్యాహ్నానికి కానీ పోలింగ్ అధికారులు రాలేదు. దాంతో పోలింగ్  ఫైనల్ ఫిగర్ ఎంతో స్పష్టంగా తెలీదు. రీ పోలింగ్ జరిగితే ఓటింగ్ శాతంలో స్పష్టత కోసం మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

పోలింగ్ సమయానికన్నా ముందే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవటం, అర్ధరాత్రి దాకా ఓపిగ్గా ఉండి ఓట్లు వేయటాన్ని అధికార టిడిపి, ప్రతిపక్ష వైసిపిలు వేటికవే సానుకూలంగా అంచనాలు వేసుకుంటున్నాయి. అయితే శుక్రవారం మధ్యాహ్నం ఈవిఎంలపైనే కాకుండా పోలింగ్ జరిగిన తీరుపై చంద్రబాబునాయుడు ఆక్రోశం చూసిన తర్వాత టిడిపి గెలుపుపై అందరిలోను ఆశలు తగ్గిపోతున్నాయి.