ఈ టీమ్‌తో వైఎస్ జగన్ 2024 ఎన్నికల్ని ఈదగలరా.?

Jagan

2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కేవలం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే పోటీ చేసినట్లు నడిచింది వ్యవహారం. ‘ఒకే ఒక్క ఛాన్స్..’ అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఓటర్లను అడిగారు.. ఆకట్టుకున్నారు. అప్పటి చంద్రబాబు సర్కారుపై వున్న తీవ్ర వ్యతిరేకత, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కలిసొచ్చింది. బరిలో ఏ అభ్యర్థి వున్నారు.? అన్నది జనం చూడలేదు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చూసి వైసీపీకి ఓట్లేశారు. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. ఇదే నిజం.

మరిప్పుడు పరిస్థితేంటి.? ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల్ని అద్భుతంగా అమలు చేస్తున్నారు. కానీ, పరిపాలన మాటేమిటి.? ఆయా విభాగాలపై మంత్రులకు వున్న పట్టు ఏమిటి.. గత మంత్రుల పని తీరు, ప్రస్తుత మంత్రుల పని తీరు, మొత్తంగా ప్రభుత్వ పనితీరుపై జనం బేరీజు వేసుకుంటున్నారు.

గడచిన మూడేళ్ళలో రాష్ట్రానికి రాజధాని లేదా రాజధానులు కట్టలేకపోయారు. ప్రత్యేక హోదా లేదు, రైల్వే జోనూ రాలేదు, కడప స్టీలు ప్లాంటు, దుగరాజపట్నం పోర్టూ రాలేదు. పోలవరం ప్రాజెక్టు పూర్తవలేదు. మరి, మూడేళ్ళో వైఎస్ జగన్ సర్కారు సాధించిందేంటి.? ముక్కీ మూలిగీ మూడేళ్ళ తర్వాత ‘నరకాన్ని తలపించే రోడ్లను’ రిపెయిర్ చేసే ప్రక్రయి ప్రారంభించారు.

గ్రామాల్లో సమస్యలు అలాగే వున్నాయ్.. పట్టణాల్లోనూ సమస్యలు తగ్గలేదు సరికదా పెరిగాయ్. మరి, సుపరిపాలన ఏదీ.? ఈ ప్రశ్నలు జనం సంధిస్తున్నారు, వైసీపీ ప్రజా ప్రతినిథులు, జనాన్ని తప్పించుకుని పారిపోవాల్సి వస్తోంది.

నూట డెబ్బయ్ ఐదు సీట్లూ కొల్గొట్టేస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. కానీ, ఎలా.? జనంలోకి ధైర్యంగా వెళ్ళలేని పరిస్థితుల్లో అన్ని నియోజకవర్గాల్లోనూ గెలవడం సాధ్యమయ్యే పనేనా.? దాదాపు 100 మంది ఎమ్మెల్లేలపై వున్న తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో వైఎస్ జగన్, వచ్చే ఎన్నికల్ని ఈదడం అంత తేలిక కాదు.!