అపుడు భూమా, ఇపుడు కిడారి..ఇద్దరిదీ ఒకే పద్దతి

చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో అత్యంత చిన్నవాళ్ళు ఎవరంటే భూమా అఖిలప్రియ, కిడారి శ్రవణ్ కుమార్ అనే చెప్పాలి. దురదృష్టం ఏమిటంటే ఇద్దరు కూడా బాధాకరమైన పరిణామాల్లోనే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయాల్సొచ్చింది. తమ తండ్రులు మరణించిన తర్వాత వారిద్దరు కారుణ్య నియామకాల్లో భాగంగానే మంత్రులయ్యారు. వైసిపి తరపున గెలిచిన భూమా నాగిరెడ్డి, భూమా అఖిలప్రియలు రాజకీయ పరిణామాల్లో తెలుగుదేశంపార్టీలోకి ఫిరాయించారు. మంత్రిపదవి హామీతోనే తాను టిడిపిలోకి ఫిరాయించానని నాగిరెడ్డే ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు.

 

ఇచ్చిన హామీని తప్పటంలో చంద్రబాబును మించిన నేత దేశంలోనే ఇంకోరు లేరన్న విషయం అందరికీ తెలిసిందే కదా ?  అదులో భాగంగానే నాగిరెడ్డికి మొండి చెయ్యి చూపించారు. అంతే కాకుండా ఎంఎల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధిని గెలిపిస్తేనే మంత్రిపదవి అన్న షరతు పెట్టారు.  ఆ నేపధ్యంలో ఎదురైన ఒత్తిడిని తట్టుకోలేకే నాగిరెడ్డి గుండెపోటుతో 2017, మార్చి 12న మరణించిన విషయం తెలిసిందే.

 

తర్వాత వచ్చిన నంద్యాల ఉపఎన్నికలో టిడిపి అభ్యర్ధిని గెలిపించుకునేందుకు, సానుభూతి ఓట్లు కోసం నాగిరెడ్డి కూతురు భూమా అఖిలప్రియకు చంద్రబాబు మంత్రిపదవి కట్టబెట్టారు. సరే పర్యాటకశాఖ మంత్రిగా అఖిలప్రియ పనితీరు ఎలాగుందన్న విషయం అందరికీ తెలిసిందే.  మంత్రి పదవిలో కూర్చున్న తర్వాత నుండి అఖిల పనితీరు మూడు వివాదాలు, ఆరు గొడవలుగా బ్రహ్మాండంగా ఉంది. కృష్ణానదిలో బోటు పడవలో  30 మంది మరణించటం, తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలకు పలువురు మరణించటం లాంటివి జరుగుతున్నా అఖిల ఏమాత్రం పట్టించుకోలేదు. అఖిల పనితీరుపై చివరకు చంద్రబాబే తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే.

 

ఇక ప్రస్తుతం శ్రవణ్ విషయానికి వస్తే తండ్రి కిడారి సర్వేశ్వరరావు కూడా హఠాత్తుగానే మరణించారు. సర్వేశ్వరరావు కూడా ఫిరాయింపు ఎంఎల్ఏనే. మొన్న సెప్టెంబర్ 23వ తేదీన మావోయిస్టుల చేతిలో హత్యకు గురయ్యారు. కిడారికి కూడా మంత్రిపదవిని ఎరగా వేసే చంద్రబాబు టిడిపిలోకి లాక్కున్నారు. నాగిరెడ్డికి చూపించినట్లే యధావిధిగా కిడారికి కూడా మొండిచెయ్యి చూపించారు. అయితే, ఇపుడు శ్రవణ్ కు మంత్రిపదవి ఇవ్వటం కూడా సానుభూతి ఓట్ల కోసమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

 

మంత్రివర్గంలో ముస్లింలు లేని మంత్రివర్గం ఏదైనా ఉందంటే దేశం మొత్తం మీద చంద్రబాబు మంత్రివర్గం మాత్రమే. దానికితోడు గిరిజనులకు కూడా చోటు కల్పించలేదు. ఎటూ ఆరునెలల్లో షెడ్యూల్ ఎన్నికలు వస్తున్నాయి. పోయిన ఎన్నికల్లో ముస్లిం, గిరిజన ఓట్లు తెలుగుదేశంపార్టీకి పడలేదు. అందుకనే వచ్చే ఎన్నికల్లో ముస్లిం, గిరిజన ఓట్లను కొల్లగొట్టే ఉద్దేశ్యం ప్లస్ సానుభూతి కోసమని శ్రవణ్ కు మంత్రిపదవి ఇచ్చారు. మరి, శ్రవణ్ పనితీరు ఏ విధంగా చూడాల్సిందే. అంటే ఆరునెలల్లో పనితీరు చూపటానికి కూడా ఏమీ ఉండదనుకోండి అది వేరే సంగతి.