బ్రేకింగ్ న్యూస్ : జగన్ పై హత్యాయత్నం కేసు-చంద్రబాబుకు హైకోర్టు షాక్

జగన్మోహన్ రెడ్డి పై హత్యాయత్నం కేసుకు సంబంధించి చంద్రబాబునాయుడుకు హైకోర్టు పెద్ద షాకే ఇఛ్చింది. రెండు వారాల్లోగా హత్యాయత్నం ఘటనపై తగిన సమాధానం ఇవ్వాలంటూ నోటీసులిచ్చింది. రెండు వారాల్లో సమాధానం చెప్పాలని కోర్టు ఆదేశాలిచ్చింది. పోయిన నెల 25వ తేదీన విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్ పై హత్యాయత్నం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. తనపై హత్యాయత్నం కుట్ర జరిగిందని జగన్ చెబుతుంటే, జగన్ పై జరిగిన దాడి అంతా ఉత్త డ్రామాగా చంద్రబాబు కొట్టిపారేశారు. జగన్ పై దాడిని చంద్రబాబు అండ్ కో కోడికత్తిగా అభివర్ణిస్తు ఎగతాళి చేశారు. దాడిపై సిట్ తో విచారణ చేయించారు.

 

అయితే, సిట్ విచారణలో నిజాలు బయటకు రావు కాబట్టి థర్డ్ పార్టీ విచారణ చేయించాలని జగన్ అండ్ కో డిమాండ్ చేస్తున్నారు. తనపై జరిగిన హత్యాయత్నాన్ని సిబిఐతో కానీ లేకపోతే న్యాయవిచారణ కానీ జరిపించాలని డిమాండ్ చేస్తు జగన్ హై కోర్టులో పిటీషన్ వేశారు. దానిపై పది రోజులుగా విచారణ జరుపుతున్న కోర్టు సిట్ విచారణ నివేదిక మొత్తాన్ని తనకు అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదే సమయంలో ఈరోజు కోర్టులో  విచారణ జరిగింది. విచారణ సందర్భంగా థర్డ్ పార్టీ విచారణ అవసరం ఏమిటన్న దానిపై జగన్ తరపు న్యాయవాది వినిపించారు. అయితే, థర్డ్ పార్టీ విచారణ అవసరం లేదని అడ్వకేట్ జనరల్ వినిపించిన వాదనలో పస లేదని కోర్టు అభిప్రాయపడింది.

 

సరే, థర్డ్ పార్టీ విచారణ విషయాన్ని పక్కనపెట్టి ముందుగా చంద్రబాబుకు నోటీసులు ఇవ్వాలని కోర్టు నిర్ణయించింది. జగన్ పై హత్యాయత్నానికి సంబంధించి చంద్రబాబు చేసిన కామెంట్లను, డిజిపి, మంత్రుల వ్యాఖ్యలను జగన్ తరపు న్యాయవాది వినిపించారు. విమానాశ్రయంలో సిసి ఫుటేజీలను న్యాయమూర్తి అడిగినపుడు అక్కడ గడచిన మూడు నెలలుగా సిసి ఫుటేజీ లేదని సమాధానం విన్న న్యాయమూర్తి ఆశ్చర్యపోయారు.

 

అదే విధంగా జగన్ పై దాడిచేసిన నిందితుడు శ్రీనివాస్ పనిచేస్తున్న క్యాంటిన్ ఎవరిది ? క్యాంటిన్ ఓనర్ హర్షవర్ధన్ చౌదరి నేపధ్యం తదితరాలను న్యాయమూర్తి అడిగి తెలుసుకున్నారు. విచారణ సందర్భంగా అడ్వకేజ్ జనరల్ వాదనలు తేలిపోవటంతో జగన్ పై హత్యాయత్నం కేసు లో చంద్రబాబు, డిజిపి. విమానాశ్రయాధికారులతో పాటు మరో ఆరుమందికి నోటీసులివ్వాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. నోటీసులకు సమాధానం ఇవ్వటానికి అందరికీ రెండు వారాలు గడువు ఇచ్చింది. చంద్రబాబుకు నోటీసులిచ్చిన నేపధ్యంలో జగన్ పై హత్యాయత్నం కేసు విచారణ ఏ మలుపులు తిరుగుతుందో అన్న ఉత్కంఠ మొదలైంది.