చంద్రబాబునాయుడుకు హై కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డిపై సిట్ విచారణను నిలిపేయాలంటూ కోర్టు ఆదేశించింది. విమానాశ్రయం పరిదిలో జరిగిన హత్యాయత్నం కేసును రాష్ట్రప్రభుత్వం ఎలా విచారణ చేస్తుందని సూటిగా ప్రశ్నించింది. కోర్టు అడిగిన ప్రశ్నకు అడ్వకేట్ జనరల్ సమాధానం చెప్పలేకపోయారు. దాంతో సిట్ విచారణను నిలిపేయాలంటూ ఆదేశించింది. విమానాశ్రయంలో జరిగిన ఘటనపై సిట్ విచారణ చేయటంపై వెంటనే కౌంటర్ దాఖలు చేయమని కోర్టు రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించటం గమనార్హం.
జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసు విచారలో న్యాయమూర్తి సంధించిన ప్రశ్నలను చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి వాదనతో ఏకీభవిస్తున్నట్లే కనబడుతోంది. సిట్ విచారణపై తమకు నమ్మకం లేదని మొదటి నుండి జగన్ చెబుతున్నారు. తనపై జరిగిన హత్యాయత్నం ఘటనపై థర్డ్ పార్టీ విచారణ కోరుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, జగన్ డిమాండ్ ను చంద్రబాబునాయుడు లెక్కచేయకపోగా సిట్ విచారణ సరిపోతుందంటూ కోడికత్తి దాడి అంటూ ఎగతాళిగా మాట్లాడుతున్నారు. ఎయిర్ పోర్టులో హత్యాయత్నం జరిగితే రాష్ట్రప్రభుత్వం ఎలా విచారిస్తుందని న్యాయమూర్తి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఎయిర్ పోర్టు పరిధిలో ఏమన్నా జరిగితే విచారణ చేయాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వానిదే కదా అంటూ న్యాయమూర్తి వేసిన ప్రశ్నకు అడ్వకేట్ జనరల్ ఏమీ సమాధానం చెప్పలేకపోయారు. కేంద్ర ప్రభుత్వం చేయించాల్సిన విచారణను రాష్ట్రప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకునే అధికారం లేదంటూ న్యాయమూర్తి స్పష్టంగా చెప్పారు. దాంతో సిట్ విచారణను వెంటనే నిలిపేయాలని ఆదేశించారు. కేసు విచారణను బుధవారానికి వాయిదా వేస్తూ తన ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పాలంటూ ఆదేశించటం గమనార్హం.