ఏపి ప్రభుత్వంపై హై కోర్టు సీరియస్

ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటన విషయంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై హై కోర్టు సీరియస్ అయ్యింది. విశాఖపట్నం విమానాశ్రయంలో  హత్యాయత్నం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్రప్రభుత్వ విచారణపై నమ్మకం లేక జగన్ థర్డ్ పార్టీ విచారణ కోరుతూ కేసు వేశారు. ఆ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి జగన్ పిటీషన్ పై సమాధానం చెప్పాలంటూ చంద్రబాబునాయుడు, ఏపి ప్రభుత్వం, డిజిపి, కేంద్రప్రభుత్వం, సిఐఎస్ఎఫ్, విమానాశ్రయ ఉన్నతాధికారులు, సిట్ లకు నోటీసులు జారీ చేసింది. కోర్టు జారీ చేసిన నోటీసులు అప్పట్లో పెద్ద సంలనమైంది.

 

రెండు వారాల్లోగా సమాధానం చెప్పాలంటూ కోర్టు జారీ చేసిన నోటీసులకు ఇటు ఏపి ప్రభుత్వం, అటు కేంద్రం కూడా లెక్క చేయలేదు. ప్రభుత్వాలే పట్టించుకోకుండా వాటి కనుసన్నుల్లో నడుస్తున్న దర్యాప్తు సంస్ధలు మాత్రం ఏమని స్పందిస్తాయి ? అందుకే ఎవ్వరూ సమాధానాలివ్వలేదు. ఇక్కడే హై కోర్టుకు మండింది. తాము ఎంత సీరియస్ గా చెప్పినా ఏపి, కేంద్రప్రభుత్వాలు స్పందిచకపోవటంపై తీవ్రంగా మండిపడింది. తమ ఆదేశాలను ఎందుకు పట్టించుకోలేదో చెప్పాలంటూ ఆదేశించింది.

 

హై కోర్టులో తనకు ఎక్కడ చుక్కెదురవుతుందో అన్న భయంతోనే జగన్ డిమాండ్ చేస్తున్నట్లుగా థర్డ్ పార్టీ విచారణకు చంద్రబాబు నిరాకరిస్తున్నారు. థర్డ్ పార్టీ అంటున్నారే కానీ జగన్ కూడా సిబిఐ అనో లేకపోతే న్యాయవిచారణ అనో పిటీషన్లో చెప్పలేదు. అయితే, సిబిఐ విచారణకు హై కోర్టు ఎక్కడ ఆదేశిస్తుందో అన్న భయంతోనే సిబిఐ ఎంట్రీని అడ్డుకుంటూ ఈమధ్యనే చంద్రబాబు జీవో ఇచ్చారు. సరే, కోర్టు సిబిఐ విచారణకు ఆదేశిస్తే చంద్రబాబు జారీ చేసిన జీవో నాలుక గీసుకోవటానికి కూడా పనికిరాదనుకోండి అది వేరే సంగతి.

 

ఇక్కడ విషయం ఏమిటంటే, హత్యాయత్నం ఘటనపై కోర్టుకు సమాధానం ఇస్తే ఏమని ఇవ్వాలన్నదే చంద్రబాబు సమస్య. జగన్ పై జరిగింది హత్యాయత్నం కాదని చెబితే తన వాదనకు తగ్గ ఆధారాలు చూపాలి. లేదూ జరిగింది హత్యాయత్నమే అని ఒప్పుకుంటే విచారణకు జగన్ చెప్పినట్లు ఎందుకు అంగీకరించటం లేదన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే, జగన్ పై జరిగిన హత్యాయత్నం ఘటనలో అనేకమార్లు చంద్రబాబు మాట మార్చారు. ఆ విషయంపైన కూడా చంద్రబాబు వివరణ ఇచ్చుకోవాలి. సమాధానం ఏమి చెప్పినా తలనొప్పే. అందుకే కోర్టుకు సమాధానం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. విచారణను సోమవారానికి వాయిదా వేసిన కోర్టు ఆలోపలే సమాధానం చెప్పాలని తాజాగా ఆదేశించింది. మరి చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారో అన్న విషయం ఆసక్తిగా మారింది.