తెలంగాణ పంచాయతీ ఎన్నికల పై హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై హైకోర్టు తీర్పునిచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక ఎన్నికలను ఆపలేమని సర్పంచ్ ఎన్నికలు నిర్వహించుకునేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బిసి రిజర్వేషన్ల పై ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ నిలిపివేసేందుకు కోర్టు నిరాకరించింది. దీని పై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను నాలుగు వారాల పాటు కోర్టు వాయిదా వేసింది.
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బిసి ఉద్యమ నేత ఆర్. కృష్ణయ్య హైకోర్టులో పిటిషన్ వేశారు. కృష్ణయ్య తో పాటు మరి కొంత మంది కూడా రిజర్వేషన్ల పై పిటిషన్ వేశారు. వీటన్నింటి పై గురువారం హైకోర్టు విచారించింది. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి, ఎన్నికల తేదిలను కూడా ప్రకటించిన తర్వాత ఆపివేయడం సమంజసం కాదని కోర్టు అభిప్రాయ పడింది. అన్ని గ్రామాల్లో కూడా రిజర్వేషన్లు ప్రకటించాక ఇలా చేయడం కరెక్ట్ కాదని కోర్టు అభిప్రాయ పడింది. జనాభాలో సగం ఉన్న బిసిలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోవడం కరెక్ట్ కాదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. దానితో కోర్టు ఏకీభవించలేదు.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం ఇప్పటికే సిద్దమైంది. మూడు విడతల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. అన్ని గ్రామాలకు రిజర్వేషన్లను కూడా ప్రకటించారు. జనవరి 21, జనవరి 25, జనవరి 30 న ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది.
తెలంగాణ ప్రభుత్వం బిసిలకు 24 శాతం రిజర్వేషన్లు కేటాయించి అన్యాయం చేస్తున్నారని బిసి నేతలు విమర్శించారు. కోర్టులో కేసు ఉండగానే సెలవు రోజున కావాలనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు ఆగి ఇప్పుడు ఆగమాగంగా ఎన్నికలు పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని వారు ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎన్నికలు నిర్వహించడమేంటని వారు ప్రశ్నించారు. పాత విధానంలో ఉన్న 34 శాతం కూడా అమలు చేయకుండా తగ్గించి 24 శాతం రిజర్వేషన్లు కేటాయించడం దారుణమన్నారు.