ఆంధ్రప్రదేశ్: వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీచేసింది. పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడి అది తీవ్రరూపం దాల్చుతోందని తెలిపింది. ఐఎండి అంచనాల ప్రకారం ఇది 24 గంటల్లో తీవ్రవాయుగుండంగా బలపడనుందని తెలిసింది. పశ్చిమ వాయువ్యం దిశగా పయనించి సోమవారం రాత్రి నర్సాపురం-విశాఖపట్నం మధ్య తీరందాటే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఏపీలోనే ఈ తీవ్ర వాయుగుండం తీరం దాటే అవకాశం ఉండడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తీరం వెంబడి సహాయ చర్యలు చేపడుతోంది. జనాలను ఖాళీ చేస్తోంది.
సోమవారం కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురువనున్నాయి. మిగిలినచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయని సమాచారం. ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి తీవ్ర భారీవర్షాలు కురుస్తాయని తెలిపారు. తీరం వెంబడి గంటకు 55-75 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
సముద్రం అలజడిగా ఉంటుంది మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన వారిని వెనక్కి రప్పిస్తున్నారు. ఎప్పటికప్పుడు వాయుగుండం స్థితిని పర్యవేక్షిస్తూ జిల్లా యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేస్తున్నారు.తీరప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి తగినజాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణకి కూడా పొంచి ఉన్న ప్రమాదం :
రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులను, ప్రజలను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కోరారు. రాష్ట్రంలో చాలా చోట్ల నేడు వర్షాలు కురుస్తున్నాయి. సోమ, మంగళ వారాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమీషనర్లతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సిఎం కోరారు. అధికారులంతా ఎక్కడివారు అక్కడే ఉండి పరిస్థితిని గమనిస్తూ అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని కోరారు. భారీ వర్షాలు, వాటితోపాటే వరదలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్ కోరారు.