గుంటూరులో పోలీస్ స్టేషన్ లో మహిళపై హెడ్ కానిస్టేబుల్ వీరంగం

గుంటూరులోని నగరపాలెం పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు వీరంగం సృష్టించాడు. విచారణ కోసం స్టేషన్ కు తీసుకొచ్చిన మహిళలపై చెప్పుతో దాడి చేశాడు. అందరూ చూస్తుండగానే ఆమెను చెప్పుతో కొట్టాడు.

పోలీస్ స్టేషన్ లో మహిళను చెప్పుతో కొడుతున్న హెడ్ కానిస్టేబుల్

ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. నగరంలోని కొండా వెంకటప్పయ్య కాలనీకి చెందిన కొందరు మహిళలను హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు కేసు ఏమిటో చెప్పకుండానే విచారణ పేరిట స్టేషన్ కు తీసుకొచ్చారు. రాత్రి సమయంలో మద్యం మత్తులో ఉన్న ఆయన మహిళల వద్దకు వచ్చి వీరంగం సృష్టించాడు. ఓ మహిళను చెప్పుతో కొట్టాడు. ఈ దృశ్యాలను అక్కడ ఉన్న కొందరు ఫోటోలు తీయడంతో వెలుగులోకి వచ్చింది.

విషయం తెలుసుకున్న పోలీస్ అధికారులు విచారణ చేపట్టారు. స్టేషన్ లో ఎవరి అనుమతి లేకుండానే హెడ్ కానిస్టేబుల్ మహిళలను స్టేషన్ కు తీసుకొచ్చినట్టు తెలుసింది. ఘటన జరిగిన సమయంలో కానిస్టేబుల్ తాగి ఉన్నట్టు అధికారులు గుర్తించారు. విచారణ పూర్తయిన తర్వాత కానిస్టేబుల్ పై చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.