నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి వైసిపికి రాజీనామా చేసిన విషయంలో తొందరపడ్డారా ?
జిల్లాలోని వైసిపి నేతలతో మాట్లాడితే అలాగనే అంటున్నారు. వెంకటగిరి నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని సమన్వయకర్తగా నియమించటాన్ని వ్యతిరేకిస్తూ బొమ్మిరెడ్డి ఈరోజు వైసిపికి రాజీనామా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ విషయమై జిల్లాలోని వైసిపి నేతలతో మాట్లాడితే చాలామంది వైసిపి నేతలు బొమ్మిరెడ్డి తొందరపడ్డారన్న అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నారు.
2014లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో వైసిపి తరపున ఆత్మకూరు మండలం జడ్పిటిసిగా బొమ్మిరెడ్డి ఎన్నికయ్యారు. జిల్లాలోని 46 మంది జడ్పిటిసిల్లో వైసిపి తరపున సుమారు 36 మంది ఎన్నికవ్వగా ఛైర్మన్ గా బొమ్మిరెడ్డి వైపు జగన్ మొగ్గారు. ఎందుకంటే రాఘవేంద్రరెడ్డి తండ్రి బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి ఆత్మకూరు నుండి రెండుసార్లు ఎంఎల్ఏగా కాంగ్రెస్ తరపున పనిచేశారు. ఆయనకు నియోజకవర్గంలో మంచి పేరుంది. తండ్రి బ్యాక్ గ్రౌండ్ తెలుసు కాబట్టే జగన్ కూడా రాఘవేంద్రరెడ్డికి జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవిని అప్పగించారు.
ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో సుమారు 6మంది జడ్పిటీసీలు పార్టీ వదిలేసి టిడిపిలోకి వెళ్ళిపోయినపుడు కొంచెం డిస్ట్రబెన్స్ జరిగింది. అయినా జగన్ మాత్రం బొమ్మిరెడ్డి కే మద్దతుగా నిలబడ్డారు. సరే, ఆ తర్వాత బొమ్మిరెడ్డినే జగన్ వెంకటగిరి నియోజకవర్గానికి ఇన్చార్జిగా కూడా నియమించారు. అప్పటి నుండి బొమ్మిరెడ్డే నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. ఎలాగూ పార్టీ కార్యక్రమాలను దగ్గరుండి చూసుకుంటున్నారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టుపై దృష్టి పెట్టారు.
అటువంటి సమయంలో హఠాత్తుగా రామనారాయణ రెడ్డి వైసిపిలో ఎంట్రీ ఇచ్చారు. నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులయ్యారంటే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు కూడా దాదాపు ఆనంకే దక్కే అవకాశాలున్నాయి. దాంతో పార్టీ నాయకత్వంపై అలిగిన బొమ్మిరెడ్డి చివరకు వైసిపికి రాజీనామా చేశారు. పార్టీకి బొమ్మిరెడ్డి చేసిందానికంటే పార్టీనే బొమ్మిరెడ్డికి చేసిందెక్కువని వైసిపి వర్గాలంటున్నాయి. జడ్పి ఛైర్మన్ పదవి ఇచ్చిన గౌరవించిన జగన్ ను కాదని బొమ్మిరెడ్డి తప్పు చేశారని కూడా పార్టీ వర్గాలంటున్నాయి. ఇప్పటికిప్పుడు ఏ పార్టీలోకి వెళ్లే అవకాశం కూడా లేని బొమ్మిరెడ్డి రాజీనామా విషయంలో తొందరపడ్డారనే జిల్లా నేతలు అభిప్రాయపడుతున్నారు.