వైసిపిలోకి సీనియర్ నేత

తూర్పుగోదావరి జిల్లాలో వైసిపికి మంచి ఊపొచ్చే పరిణామం జరగనున్నది. జిల్లాలో  సినియర్ నేత, మాజీ ఎంపి జివి హర్షకుమార్ తొందరలో వైసిపిలో చేరబోతున్నట్లు సమాచారం. హర్షకుమార్ రెండుసార్లు అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం నుండి లోక్ సభకు ఎన్నికైన విషయం తెలిసిందే. 2004-2014 మధ్య హర్షకుమార్ రెండుసార్లు గెలిచారు. పోయిన ఎన్నికల్లో జై సమైక్యపార్టీ తరపున పోటీ చేసినా ఓడిపోయారు. అప్పటి నుండి క్రియాశీల రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. కాకపోతే ఎప్పుడైనా మీడియా సమావేశాల్లో మాత్రం కనబడుతున్నారు.

 

ఆమధ్య జనసేనలో  చేరుతారని కూడా ప్రచారం జరిగింది. కానీ వివిధ కారణాల వల్ల జనసేనకు దూరమైనట్లే కనబడుతోంది. ఎలాగంటే ఈ మధ్య తరచూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా విరుచుకుపడుతున్నారు. అదే సందర్భంలో హర్షకుమార్ కు వైసిపి నుండి ఆహ్వానం వచ్చినట్లు సమాచారం. దానికితోడు అమలాపురం పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేయటానికి వైసిపి నుండి చెప్పుకోతగ్గ గట్టి నేతలు లేరన్న మాటా వాస్తవం.

 

కాబట్టి రేపటి ఎన్నికల్లో హర్షకుమార్ అయితే ఎంపి అభ్యర్ధిగా ఉపయోగం ఉంటుందని జిల్లాలోని కొందరు సీనియర్ నేతలు భావించారట. అయితే, హర్షకుమార్-వైసిపి మధ్య మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ సంధానకర్తగా వ్యవహరించినట్లు సమాచారం. మొన్ననే రాజమండ్రికి చెందిన బిసి నేత, బిగ్ షాట్ మార్గాని నాగేశ్వరరావు వైసిపిలో చేరిన సంగతి అందరికీ తెలిసిందే.

 

మార్గానికి రాజమండ్రి లోక్ సభ అభ్యర్ధిగా జగన్ ప్రకటించారు. మార్గాని వైసిపిలో చేరటం కూడా ఉండవల్లి సూచన మేరకే జరిగింది. ప్రస్తుతం హర్షకుమార్ వైసిపిలో చేరాలని నిర్ణయించుకోవటంలో కూడా ఉండవల్లి సలహాలే ఉన్నట్లు సమాచారం. పరిస్ధితులన్నీ అనుకూలిస్తే శ్రీకాకుళం జిల్లా పర్యటనలోనే వైసిపిలో చేరటానికి రంగం సిద్ధం చేసుకున్నారట. చూద్దాం ఎప్పుడు చేరుతారో ?